మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు

by Jakkula.Mamatha |

మిర్యాలగూడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు.

మిర్యాలగూడలో చైన్ స్నాచింగ్ కేసు ఛేదించిన పోలీసులు
X

దిశ, మిర్యాలగూడ రూరల్: మిర్యాలగూడ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసును పోలీసులు ఛేదించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, సునిశిత దర్యాప్తుతో నిందితుడిని గుర్తించి అరెస్టు చేసినట్లు నల్గొండ అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) జి.రమేష్ తెలిపారు. పోలీసుల వివరాల ప్రకారం.. ఈ నెల 12వ తేదీ తెల్లవారుజామున మిర్యాలగూడ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో, ఎన్‌వీఆర్–పీవీఆర్ గార్డెన్స్ సమీపంలో ఓ మహిళ ఇంటి ముందు ఉండగా నిందితుడు యాక్టివా స్కూటీ పై వచ్చి చిరునామా అడిగాడు. అనంతరం ఆమెతో మాటలు కలిపి ఇంటి ప్రాంగణంలోకి ప్రవేశించి, ఆమె మెడలో ఉన్న బంగారు పుస్తెలతాడు, రెండు వరుసల బంగారు చైన్, నల్లపూసల బంగారు గొలుసు తదితర ఆభరణాలను బలవంతంగా లాక్కొని పరారయ్యాడు. ఈ ఘటనలో సుమారు 9 తులాల బంగారు ఆభరణాలు అపహరణకు గురయ్యాయి.

నేరానికి పాల్పడిన సమయంలో నిందితుడు తలకు టోపీ, ముఖానికి కర్చీఫ్ ధరించడంతో పాటు నెంబర్ ప్లేట్ లేని యాక్టివా స్కూటీని ఉపయోగించి పోలీసులకు సవాల్‌గా మారాడు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్, ఐపీఎస్ ఆదేశాల మేరకు నల్గొండ అడిషనల్ ఎస్పీ, డీఎస్పీ రవి పర్యవేక్షణలో మిర్యాలగూడ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగభూషణరావు ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందాలు సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు ముమ్మరం చేశాయి. నిందితుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించిన పోలీసులు, అతని కదలికలపై నిఘా పెట్టారు. మిర్యాలగూడలో మరో చైన్ స్నాచింగ్‌కు పాల్పడేందుకు హనుమాన్‌పేట ఫ్లైఓవర్ సమీపంలో రెక్కీ నిర్వహిస్తున్న నిందితుడిని పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.

అతని వద్ద నుంచి చోరీ చేసిన బంగారు ఆభరణాలతో పాటు యాక్టివా స్కూటీ, నేర సమయంలో ఉపయోగించిన టోపీ, ముఖానికి కర్చీఫ్, రెడ్‌మీ ఏ2 లైట్ గ్రీన్ కలర్ స్మార్ట్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో నిందితుడు షేక్ నాగుల్ మీరా అలియాస్ బిల్లా(27), నారాయణపూర్ గ్రామం, దాచేపల్లి మండలం, పల్నాడు జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తిగా తేలింది. ఇంటర్మీడియట్ చదువును మధ్యలోనే నిలిపివేసి బెంగళూరులో వెల్డింగ్ పని చేసినట్లు పోలీసులు తెలిపారు. చెడు సావాసాలకు అలవాటుపడి నేరాలకు పాల్పడటం ప్రారంభించిన నిందితుడిపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో హత్యలు, రాబరీ, చైన్ స్నాచింగ్ తదితర కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు. పలుమార్లు జైలుకు వెళ్లి విడుదలైన అనంతరం తిరిగి ఇదే తరహా నేరాలకు పాల్పడుతున్నట్లు తెలిపారు.

నిందితుడిపై నాదెండ్ల, గన్నవరం, భవానీపురం, దాచేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో హత్య, దోపిడీ కేసులతో పాటు తెలంగాణలోని వైరా, కర్ణాటకలోని చల్లకెరె, ఆంధ్రప్రదేశ్‌లోని పోలమానూరు, పిడుగురాళ్ల, పుంగనూరు, తమిళనాడులోని కృష్ణగిరి తదితర ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్, రాబరీ కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. మొత్తం మీద పలు రాష్ట్రాల్లో సుమారు 12 కేసులతో నిందితుడికి సంబంధం ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పేర్కొన్నారు. చైన్ స్నాచింగ్ కేసును సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సునిశిత దర్యాప్తు ద్వారా త్వరితగతిన ఛేదించిన మిర్యాలగూడ టౌన్ ఇన్‌స్పెక్టర్ ఎం. నాగభూషణరావు, ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్, పీఎస్‌ఐ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ రామ్, కానిస్టేబుళ్లు నల్లగంతుల శ్రీను, శీలం వెంకటేశ్వర్లు, గద్దల హుస్సేన్, బి. వీరబాబు, జి. నర్సింహ, బి.ప్రసాద్‌లను అడిషనల్ ఎస్పీ జి.రమేష్ ప్రత్యేకంగా అభినందించారు.

Next Story