మూర్ఛ వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడి.. రూ.1.08 లక్షలు సురక్షితంగా అప్పగించిన పోలీసులు!

by Jakkula.Mamatha |

పోలీసుల అప్రమత్తత, మానవత్వం, నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఘటన జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

మూర్ఛ వచ్చిన వ్యక్తి ప్రాణాలు కాపాడి.. రూ.1.08 లక్షలు సురక్షితంగా అప్పగించిన పోలీసులు!
X

దిశ,జన్నారం: పోలీసుల అప్రమత్తత, మానవత్వం, నిజాయితీకి నిదర్శనంగా నిలిచిన ఘటన జన్నారం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గత ఆదివారం రాత్రి 10:37 గంటల సమయంలో ఓ వ్యక్తికి అకస్మాత్తుగా మూర్ఛ వచ్చి నోటి నుంచి నురగ రావడం గమనించిన బ్లూ కోల్ట్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ దేవన్న, హోమ్ గార్డ్ నీలయ్య వెంటనే ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ సమాచారం అందించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ చాకచక్యంగా స్పందించి, ఆలస్యం చేయకుండా ప్రైవేట్ అంబులెన్స్ ఏర్పాటు చేసి బాధితుడిని లక్సెట్టిపేట్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందేలా చర్యలు చేపట్టారు. అనంతరం బాధితుడు పడివున్న ప్రదేశాన్ని పరిశీలించిగ అక్కడ ఉన్న ఒక కవర్‌లో రూ.1,08,000 నగదు ఉండటాన్ని గుర్తించారు.

ఆ నగదును భద్రపరిచి, బాధితుడి వివరాలపై ఆరా తీయగా అతను లోతేర్రె గ్రామానికి చెందిన కుర్సెంగా దేవరావుగా గుర్తించారు. మంగళవారం లోతేర్రె గ్రామ సర్పంచ్ బోడ శంకర్ సమక్షంలో కుర్సెంగా దేవరావుకు రూ.1.08 లక్షల నగదును పోలీసులు భద్రంగా అప్పగించారు. తన ప్రాణాలను కాపాడటమే కాకుండా, పోయిందని భావించిన నగదును సైతం యథాతథంగా తిరిగి అందజేయడంతో దేవరావు భావోద్వేగానికి గురయ్యారు. ఆనందభాష్పాలతో పోలీసులకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎస్‌ఐ ఉదయ్ కిరణ్, బ్లూ కోల్ట్ సిబ్బందికి, పోలీసు శాఖకు జీవితాంతం రుణపడి ఉంటానని కన్నీటి పర్యంతమయ్యారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, రాత్రి వేళల్లో ఎవరూ తమ వెంట పెద్ద మొత్తంలో నగదును తీసుకెళ్లకుండా జాగ్రత్తలు పాటించాలని, అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

Next Story