- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఓకేలో మళ్లీ పోలీసుల కాల్పులు.. 16 మంది మృతి
నిరసనకారులపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటన మరువకముందే, తాజాగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్ : పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. నిరసనకారులపై ఇటీవల జరిగిన కాల్పుల ఘటన మరువకముందే, తాజాగా భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో మరో 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక నివేదికలు చెబుతున్నాయి. ఈ తాజా మరణాలతో ఈ ప్రాంతంలో గత వారం రోజులుగా జరిగిన ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 30 దాటినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పీఓకే పరిధిలోని ప్రధాన నగరాల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు మొబైల్, ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.
ఆందోళనలకు ప్రధాన కారణాలు ఇవే
జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (JAAC) నేతృత్వంలో ఈ నిరసనలు ఉధృతంగా సాగుతున్నాయి. పీఓకేలో విపరీతంగా పెరిగిపోయిన నిత్యావసర వస్తువుల ధరలు, విద్యుత్ బిల్లులపై సబ్సిడీలు ఇవ్వాలని ప్రజలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నారు. దీనికి తోడు జూలైలో జరగబోయే ప్రాంతీయ ఎన్నికల్లో శరణార్థుల కోసం 12 స్థానాలను రిజర్వ్ చేయాలనే పాక్ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ స్థానిక ట్రేడర్స్, సివిల్ సొసైటీ గ్రూపులు తిరుగుబావుటా ఎగురవేశాయి.
ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధం
పరిస్థితి చేదాటిపోతుండటంతో పాక్ అనుకూల స్థానిక ప్రభుత్వం జాయింట్ అవామీ యాక్షన్ కమిటీని ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధిత సంస్థగా ప్రకటించింది. అంతేకాకుండా ఆందోళనలను అణచివేయడానికి పాకిస్తాన్ కేంద్ర ప్రభుత్వం భారీగా పారామిలిటరీ బలగాలను పీఓకేకు తరలించింది. రావలకోట్, ముజఫరాబాద్ వంటి నగరాల్లో నిరసనకారుల ర్యాలీలపై భద్రతా బలగాలు లైవ్ రౌండ్ల కాల్పులు, లాఠీఛార్జ్ మరియు టియర్ గ్యాస్ ప్రయోగించడంతో రణరంగంగా మారింది. ఈ పరిణామాలపై బ్రిటన్ పార్లమెంట్ సభ్యులతో పాటు అంతర్జాతీయ మానవ హక్కుల సంఘాలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.






