ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం

by Taduka Kalyani |

ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం పార్కులను అభివృద్ధి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అన్నారు.

ప్రజలకు ఆహ్లాదకర వాతావరణాన్ని అందించేందుకు కృషి చేస్తున్నాం
X

దిశ, రాజేంద్రనగర్ : ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడం కోసం పార్కులను అభివృద్ధి చేస్తున్నామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి ప్రకాష్ గౌడ్ అన్నారు. రాజేంద్రనగర్ జోన్ పరిధిలోని రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిళ్ల లో ఏర్పాటు చేసిన రెండు పార్కులను గురువారం ఆయన శాసనమండలి సభ్యులు మీర్జా రహ్మత్ బేగ్, రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి, అర్బన్ బయోడైవర్సిటీ డైరెక్టర్ వి. వెంకటేశ్వరరావు లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ మాట్లాడుతూ.. ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించినప్పుడు మానసిక ప్రశాంతత ఉంటుందని గుర్తు చేశారు. ప్రజలకు మెరుగైన జీవన విధానాలను కల్పించడానికి పార్కులు ఎంతో ఉపయోగపడతాయన్నారు.ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసుకోవడానికి, కుటుంబంతో కలిసి సేద తీరడానికి, చిన్నపిల్లలు ఆడుకోవడానికి పార్కులు అనుకూలంగా ఉంటాయన్నారు. రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్ సోలిపేట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రాజేంద్రనగర్ సర్కిల్ జన చైతన్య కాలనీలో రూ. 29.91 లక్షలతో ఒక పార్కు , అత్తాపూర్ సర్కిల్ హైదర్ గూడ సిరిమల్లె నగర్ కాలనీలో రూ. 22.34 లక్షలతో ఒక పార్కు ను అభివృద్ధి చేయడం జరిగిందన్నారు. ఇలాంటి పార్కులు స్థానిక ప్రజలకు, కాలనీవాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రాజేంద్రనగర్ పరిధిలో ఉన్న పార్కులన్నింటినీ అందంగా తీర్చిదిద్దడానికి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్, అత్తాపూర్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్లు సురేందర్ రెడ్డి, మల్లయ్య లతో పాటు వివిధ విభాగాల అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

Next Story