Gold: ఐదో రోజూ బంగారం డౌన్

by S Gopi |

మరోవైపు, గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరించుకోవడం కూడా బంగారం డిమాండ్‌ను దెబ్బతీస్తోంది.

Gold: ఐదో రోజూ బంగారం డౌన్
X

దిశ, బిజినెస్ బ్యూరో: అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి ప్రభావంతో దేశీయంగా బంగారం ధరలు వరుసగా ఐదో ట్రేడింగ్ సెషన్‌లో పడిపోయాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో ఆగస్టు డెలివరీ గోల్డ్ ఫ్యూచర్స్ 10 గ్రాములు రూ.1,47,740కి పడిపోయాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో బంగారం ధరలు వరుసగా రెండో రోజు కూడా గణనీయంగా తగ్గాయి. 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం ధర 10 గ్రాములకు రూ.2,100 పడిపోయి రూ.1,53,900కు చేరింది. బుధవారం ఇది రూ.1,56,000 వద్ద ఉండగా, ఒక్కరోజులోనే మళ్లీ భారీగా క్షీణించింది. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు, పెరుగుతున్న ఇంధన ధరలు, అమెరికా ఆర్థిక గణాంకాలు మెరుగైన వృద్ధి సంకేతాలు కలిసి బంగారం మార్కెట్‌పై ఒత్తిడిని పెంచుతున్నాయి. దీంతో అమెరికా ఫెడ్ అనుకున్న దానికంటే ఎక్కువ కాలం అధిక వడ్డీ రేట్లను కొనసాగించే అవకాశం ఉందనే అంచనాలు బలపడుతున్నాయి. మరోవైపు, గోల్డ్ ఈటీఎఫ్‌ల నుంచి పెట్టుబడిదారులు నిధులు ఉపసంహరించుకోవడం కూడా బంగారం డిమాండ్‌ను దెబ్బతీస్తోంది. ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం, హైదరాబాద్ మార్కెట్లో స్వచ్ఛమైన పసిడి 10 గ్రాములు రూ. 2,130 తగ్గి రూ. 1,45,740కి చేరగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం పది గ్రాములు రూ. 1,950 తగ్గి రూ. 1,33,500కి దిగొచ్చింది. వెండి మాత్రం రూ. 10,000 పెరిగి కిలో రూ. 2.60 లక్షలకు చేరుకుంది.

Next Story