సెక్స్ వర్కర్ల కస్టమర్లపై 'ట్రాఫికింగ్' కేసులు కుదరవు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు

by Kema Shiva Kumar |   (  Updated:2026-06-11 17:09:25  IST  )

సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లే కస్టమర్లపై మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసే విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది.

సెక్స్ వర్కర్ల కస్టమర్లపై ట్రాఫికింగ్ కేసులు కుదరవు.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: సెక్స్ వర్కర్ల వద్దకు వెళ్లే కస్టమర్లపై పోలీసులు మానవ అక్రమ రవాణా కేసులు నమోదు చేసే విషయంలో తెలంగాణ హైకోర్టు కీలక స్పష్టతనిచ్చింది. సెక్స్ వర్కర్ సేవలను పొందిన వ్యక్తిని కేవలం ఖాతాదారుడనే కారణంతో ఐపీసీ సెక్షన్ 370 కింద నేరస్థుడిగా పరిగణించలేమని ధర్మాసనం తీర్పు వెలువరించింది. జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ బీ‌ఆర్. మధుసూదన్‌రావులతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు కీలక మార్గదర్శకాలను జారీ చేసింది.

సెక్స్ వర్కర్ల ఖాతాదారులపై ట్రాఫికింగ్ కేసులు నమోదు చేయవచ్చా లేదా అనే అంశంపై గతంలో వివిధ సింగిల్ బెంచ్‌లు భిన్నాభిప్రాయాలు వ్యక్తంచేసిన నేపథ్యంలో, డివిజన్ బెంచ్ ఈ అంశాన్ని లోతుగా పరిశీలించింది. ఐపీసీ సెక్షన్ 370 అనేది మానవ అక్రమ రవాణాకు పాల్పడే వారిని, అంటే వ్యక్తులను విక్రయించేవారిని లేదా రవాణా చేసేవారిని శిక్షించేందుకు ఉద్దేశించినదని కోర్టు స్పష్టం చేసింది. ఒక వ్యక్తి కేవలం సెక్స్ వర్కర్ సేవలను తన కోసం వినియోగించుకుంటే, అతన్ని అక్రమ రవాణాదారుడు అని పిలవలేమని తేల్చిచెప్పింది. అయితే, ఇతరులకు సెక్స్ వర్కర్లను సరఫరా చేయడం లేదా మధ్యవర్తిత్వం వహించే వారిపై మాత్రం ఈ సెక్షన్ వర్తిస్తుందని వివరించింది.

ఖాతాదారులపై చర్యలు తీసుకునే విషయంలో సెక్షన్ 370A(2) ప్రాముఖ్యతను కోర్టు వివరించింది. ఒక సెక్స్ వర్కర్ బలవంతంగా అక్రమ రవాణాకు గురైందని తెలిసి కూడా, లేదా అలా నమ్మడానికి తగిన ఆధారాలు ఉన్నా.. ఆమె సేవలను లైంగిక దోపిడీ కోసం వినియోగిస్తే అప్పుడు ఆ ఖాతాదారుడిపై సెక్షన్ 370A(2) కింద కేసు నమోదు చేయవచ్చని పేర్కొంది. అంటే, బాధితురాలి పరిస్థితి కస్టమర్‌కు ముందే తెలిసి ఉండటం ఇక్కడ ప్రధానాంశమని కోర్టు స్పష్టం చేసింది. వేశ్యగృహం, వ్యభిచారం జరుగుతున్న ప్రాంతం సమీపంలో ఒక వ్యక్తి కనిపించగానే అతన్ని నేరస్థుడిగా ముద్ర వేయకూడదని హైకోర్టు పోలీసులను హెచ్చరించింది. ‘అక్రమ రవాణాకు గురైన బాధితురాలిని లైంగిక దోపిడీ కోసం వినియోగించుకోవడానికి సదరు ఖాతాదారుడు ప్రయత్నించాడనేందుకు స్పష్టమైన ఆధారాలు ఉండాలి. కేవలం ఆ ప్రాంతంలో ఉన్నంత మాత్రాన సెక్షన్ 370A(2) కింద అది నేరం అవ్వదు’ అని పేర్కొంది.

సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ప్రస్తావిస్తూ.. స్వచ్ఛందంగా ఈ వృత్తిని ఎంచుకున్న సెక్స్ వర్కర్లను, వారి వద్దకు వచ్చే ఖాతాదారులను చట్టాన్ని అమలు చేసే సంస్థలు వేధించరాదని హైకోర్టు స్పష్టం చేసింది. సమ్మతితో కూడిన సెక్స్ వర్క్ భారత చట్టాల ప్రకారం నేరం కాదు. అక్రమ రవాణాకు గురైన వారిని రక్షించడం పోలీసుల బాధ్యత, అంతేకానీ స్వచ్ఛందంగా వృత్తిలో ఉన్నవారిని ఇబ్బంది పెట్టకూడదని ధర్మాసనం హితవు పలికింది.

Next Story