- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోల్ గ్యాసిఫికేషన్‌కు హైదరాబాద్ మూలాధారం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
దేశీయ బొగ్గు రక్షణలో విప్లవాత్మక మార్పులు తెచ్చే ‘కోల్ గ్యాసిఫికేషన్’ విధానానికి హైదరాబాద్ నగరమే మూలాధారమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: దేశీయ బొగ్గు వనరులను సమర్థవంతంగా వినియోగించుకునే ‘కోల్ గ్యాసిఫికేషన్’ విధానానికి హైదరాబాద్ నగరం ఎంతో కీలకంగా మారిందని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి అన్నారు. నగరంలోని హెచ్ఐసీసీ- నోవాటెల్ కన్వెన్షన్ సెంటర్‌లో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన ‘ఉపరితల బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రోత్సాహక రోడ్‌షో’కు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఒకప్పుడు దేశీయ బొగ్గులో బూడిద శాతం ఎక్కువగా ఉండటం వల్ల గ్యాసిఫికేషన్ సాధ్యం కాదనే అభిప్రాయం ఉండేదని గుర్తుచేశారు. కానీ, హైదరాబాద్‌లోని బీహెచ్‌ఈఎల్ (BHEL), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (IICT) వంటి పరిశోధన సంస్థల శాస్త్రవేత్తలు ఇక్కడి బొగ్గును గ్యాసిఫికేషన్ చేసే సాంకేతికతను విజయవంతంగా అభివృద్ధి చేశారని కొనియాడారు. తెలంగాణలో సింగరేణి వద్ద అపారమైన బొగ్గు నిల్వలు ఉన్నాయని, ఫార్మా రాజధాని అయిన హైదరాబాద్ నగరం.. కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా ఉత్పత్తి అయ్యే మిథనాల్, అమ్మోనియా, హైడ్రోజన్ వంటి ఉత్పత్తులకు అద్భుతమైన మార్కెట్ అని ఆయన పేర్కొన్నారు.
రూ.46 వేల కోట్లతో భారీ పథకం..
కోల్ గ్యాసిఫికేషన్‌ను మరింత వేగంగా ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.46,000 కోట్ల భారీ ప్రోత్సాహక పథకాన్ని ప్రకటించిందని కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇందులో భాగంగా ఇటీవల ఆమోదం పొందిన రూ.37,500 కోట్ల ప్రత్యేక పథకం ద్వారా దేశవ్యాప్తంగా మెగా గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల స్థాపన వేగవంతం కానుందని చెప్పారు. ఈ పథకం ద్వారా దేశంలోకి సుమారు రూ.3 లక్షల కోట్ల పెట్టుబడులు రావడమే కాకుండా, వేలాది మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. ప్రస్తుతం వివిధ రంగాల దిగుమతుల కోసం ఏటా వెచ్చిస్తున్న రూ.3 లక్షల కోట్ల విదేశీ మారకద్రవ్యాన్ని ఈ సాంకేతికత ద్వారా ఆదా చేయవచ్చని స్పష్టం చేశారు. చైనా, అమెరికా, దక్షిణాఫ్రికా దేశాల తరహాలోనే భారత్‌లోనూ ప్రపంచ స్థాయి గ్యాసిఫికేషన్ పరిశ్రమను అభివృద్ధి చేసేందుకు అవసరమైన నిల్వలు, పాలసీ మద్దతు, రాజకీయ నిబద్ధత దేశానికి ఉన్నాయని మంత్రి పునరుద్ఘాటించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీష్ చంద్ర దూబేతో పాటు పలువురు పరిశ్రమల ప్రతినిధులు, శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.






