ఆపరేషన్ అడ్డా : అర్ధరాత్రి కోదాడలో పోలీసుల మెరుపు తనిఖీలు

by Batti.Sumithra |

కోదాడ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు.

ఆపరేషన్ అడ్డా : అర్ధరాత్రి కోదాడలో పోలీసుల మెరుపు తనిఖీలు
X

దిశ, కోదాడ : కోదాడ పట్టణంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారి పై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. 'ఆపరేషన్ అడ్డా'లో భాగంగా శుక్రవారం అర్ధరాత్రి పోలీసులు మెరుపు తనిఖీలు నిర్వహించారు. అనవసరంగా రోడ్ల పై సంచరిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. రాత్రి 11 గంటల తర్వాత సరైన కారణం లేకుండా వీధుల్లో తిరిగే వారిపై ఇక పై ఎలాంటి ఉపేక్ష ఉండదని కోదాడ పట్టణ సీఐ శివశంకర్ స్పష్టం చేశారు. బంజర కాలనీ, శ్రీమన్నారాయణ కాలనీ, నయన్‌నగర్, దుర్గాపురం తదితర ప్రాంతాల్లో ఆకస్మికంగా నిర్వహించిన తనిఖీల్లో రాత్రివేళ గుంపులుగా సంచరిస్తున్న 20 మంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి, వారి తల్లిదండ్రులను పిలిపించారు.

తల్లిదండ్రుల సమక్షంలో యువకులకు కౌన్సెలింగ్ నిర్వహించిన పోలీసులు రాత్రివేళల్లో అనవసరంగా బయట తిరగడం వల్ల జరిగే ప్రమాదాలు, నేరాల్లో చిక్కుకునే అవకాశాలు, చట్టపరమైన పరిణామాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సీఐ శివశంకర్ మాట్లాడుతూ రాత్రివేళల్లో రోడ్ల పై గుంపులుగా తిరగడం, కాలనీల్లో అడ్డాలు వేసుకుని ప్రజలకు అసౌకర్యం కలిగించడం, అనుమానాస్పదంగా సంచరించడం వంటి చర్యలను ఇక పై ఏమాత్రం సహించబోమని హెచ్చరించారు. పోలీసుల హెచ్చరికలను బేఖాతరు చేస్తే నేరుగా కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

మైనర్ల చేత వాహనాలు నడిపిస్తే తల్లిదండ్రులే బాధ్యత వహించాల్సి ఉంటుందని, వారిపైనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదేవిధంగా మద్యం సేవించి వాహనాలు నడపడం (డ్రంక్ అండ్ డ్రైవ్), ట్రిపుల్ రైడింగ్, అతివేగంగా వాహనాలు నడపడం, ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడం వంటి వాటి పై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకోవడం తప్పదని స్పష్టం చేశారు. పట్టణంలో నేరాలకు అడ్డుకట్ట వేయడం, యువతను తప్పుదారి పట్టకుండా కాపాడడం, ప్రజలకు భద్రత కల్పించడమే 'ఆపరేషన్ అడ్డా' లక్ష్యమని సీఐ పేర్కొన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్ ఇకపై నిరంతరం కొనసాగుతుందని, చట్టాన్ని గౌరవిస్తూ పోలీసులకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

Next Story