- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Nirmala Sitaraman: 2036 నాటికి భారత వినియోగంలో 93 శాతం మధ్యతరగతిదే
2036 నాటికి దేశ మొత్తం వినియోగ వ్యయంలో 93 శాతం వాటా మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వినియోగదారుల నుంచే వస్తుందని ఆమె వెల్లడించారు.

దిశ, బిజినెస్ బ్యూరో: భారత్‌లో అమలు చేస్తున్న పన్ను రాయితీలు, సంక్షేమ పథకాల ప్రభావంతో ప్రజల కొనుగోలు శక్తి గణనీయంగా పెరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఫలితంగా, 2036 నాటికి దేశ మొత్తం వినియోగ వ్యయంలో 93 శాతం వాటా మధ్యతరగతి, ఉన్నత మధ్యతరగతి వినియోగదారుల నుంచే వస్తుందని ఆమె వెల్లడించారు. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రసంగించిన ఆమె, భారత మధ్యతరగతి ఇకపై మహానగరాలకే పరిమితం కాదని, రెండో, మూడో శ్రేణి నగరాల వరకు వేగంగా విస్తరిస్తోందని చెప్పారు. ఈ వర్గం ఆర్థిక వృద్ధికి లబ్ధిదారులు మాత్రమే కాకుండా, దేశీయ వినియోగాన్ని పెంచుతూ వృద్ధికి ప్రధాన చోదకశక్తిగా మారిందన్నారు. ఓఈసీడీ అంచనాల ప్రకారం.. 2030-35 మధ్యకాలంలో మధ్యతరగతి జనాభా పరంగా భారత్ చైనాను అధిగమించే అవకాశముందని, ప్రస్తుతం దేశ జనాభాలో సుమారు 31 శాతం మంది మధ్యతరగతికి చెందినవారని ఆమె పేర్కొన్నారు.
జన్‌ధన్ యోజన పథకం, డిజిటల్ బ్యాంకింగ్ విస్తరణ, ప్రభుత్వ రుణ హామీ పథకాలు చిన్న వ్యాపారాలు, మొదటిసారి వ్యాపారం ప్రారంభించే పారిశ్రామికవేత్తలకు కొత్త అవకాశాలు కల్పించాయని సీతారామన్ వివరించారు. తాకట్టు లేకుండానే రుణాలు పొందడం, మంచి క్రెడిట్ హిస్టరీ ఆధారంగా అధిక స్థాయి రుణాలకు చేరుకోవడం ఇప్పుడు సాధ్యమవుతోందన్నారు. స్మార్ట్‌ఫోన్‌ల ద్వారా డిజిటల్ చెల్లింపులు విస్తరించడంతో చిన్న వ్యాపారాలు అధికారిక ఆర్థిక వ్యవస్థలోకి వచ్చి, సంస్థాగత రుణాలు పొందే అవకాశం పెరిగిందని చెప్పారు. ఏఐ ఆధారిత నైపుణ్య శిక్షణ, పరిశ్రమల భాగస్వామ్యంతో భారత్‌లో ప్రతిభావంతులైన మానవ వనరులు తయారవుతున్నాయని, దీంతో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లకు భారత్ ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు. ఇదే పర్యటనలో ఫ్రాన్స్ ఆర్థిక మంత్రి రోలాండ్ లెస్కూర్‌తో కలిసి జరిగిన భారత్-ఫ్రాన్స్ ఆర్థిక, ద్రవ్య చర్చల్లో కీలక ఖనిజాలు, హైస్పీడ్ రైలు, పరస్పర పెట్టుబడులు, ఆర్థిక రంగ సహకారంపై ఇరు దేశాలు చర్చించినట్లు తెలిపారు.






