- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి ఇల్లు అందిస్తాం : ఎమ్మెల్యే
అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు తెలిపారు.

దిశ, చర్ల : అర్హులైన ప్రతి నిరుపేద కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా ఇల్లు మంజూరు చేస్తుందని భద్రాచలం ఎమ్మెల్యే డా. తెల్లం వెంకట్రావు తెలిపారు. శనివారం చర్ల మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధిని సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోందన్నారు. పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇళ్లులేని వారికి ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా గృహాలు, అర్హులకు పెన్షన్లు, రైతులకు రైతు భరోసా, ఇతర సంక్షేమ పథకాలను పారదర్శకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. భద్రాచలం నియోజకవర్గ అభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
భద్రాచలం–చర్ల ప్రధాన రహదారి అభివృద్ధికి సుమారు రూ.67 కోట్లు, సత్యనారాయణపురం నుంచి లొంగల వరకు రహదారి నిర్మాణానికి రూ.9 కోట్లు, చర్ల బస్టాండ్ నుంచి తాళిపేరు ప్రాజెక్టు వరకు నూతన రహదారి నిర్మాణానికి రూ.7 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, ప్రభుత్వ భవనాల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని చెప్పారు. ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానం 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన సేవలను ప్రజలు గుర్తిస్తున్నారని ఎమ్మెల్యే అన్నారు. అనంతరం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి భారీ పాలాభిషేకం నిర్వహించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, టీపీసీసీ నాయకులు నల్లపు దుర్గాప్రసాద్, చీమలమర్రి మురళీకృష్ణ, లంక రాజు, చర్ల సొసైటీ అధ్యక్షుడు పరుచూరి రవికుమార్, బండారు రామకృష్ణ, జవ్వాది రవికుమార్, రాయచంద్ర ప్రసాద్, మేడబోయిన వాసు తదితరులు పాల్గొన్నారు.






