మళ్లీ దెబ్బతిన్న సీతారామ కాలువ రిటైనింగ్ వాల్

by Batti.Sumithra |

సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనుల్లో మరోసారి లోపాలు వెలుగుచూశాయి. కమలాపురం సమీపంలో ఇటీవల నిర్మించిన కాలువ రిటైనింగ్ వాల్‌లో కొంత భాగం దెబ్బతినడంతో అధికారులు మరోసారి మరమ్మతు పనులు చేపట్టారు.

మళ్లీ దెబ్బతిన్న సీతారామ కాలువ రిటైనింగ్ వాల్
X

దిశ, ములకలపల్లి : సీతారామ ప్రాజెక్టు కాలువ నిర్మాణ పనుల్లో మరోసారి లోపాలు వెలుగుచూశాయి. కమలాపురం సమీపంలో ఇటీవల నిర్మించిన కాలువ రిటైనింగ్ వాల్‌లో కొంత భాగం దెబ్బతినడంతో అధికారులు మరోసారి మరమ్మతు పనులు చేపట్టారు. ఇటీవలే నిర్మించిన గోడ మళ్లీ దెబ్బతినడం నిర్మాణ నాణ్యతపై అనుమానాలకు తావిస్తోంది. గోడ పక్కన మట్టి కుంగిపోవడంతో పాటు కొన్ని చోట్ల గోతులు ఏర్పడ్డాయి. దీంతో దెబ్బతిన్న భాగాన్ని తొలగించి తిరిగి నిర్మించే పనులు కొనసాగుతున్నాయి. కార్మికులతో మట్టి నింపించి, గోడను బలోపేతం చేసే చర్యలు చేపడుతున్నారు. ఇటీవలే పూర్తయిన నిర్మాణం మళ్లీ దెబ్బతినడం వెనుక గల కారణాల పై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు.

నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలు పాటించారా ? సాంకేతిక లోపాల వల్లే గోడ దెబ్బతిందా? లేక మట్టి కుదింపు సరిగా చేయకపోవడమే దీనికి కారణమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరమ్మతులతో సరిపెట్టకుండా, గోడ దెబ్బతినడానికి గల అసలు కారణాలను గుర్తించి శాశ్వత పరిష్కారం చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో కాలువలో నీటి ప్రవాహం ప్రారంభమైన తర్వాత ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్మాణ నాణ్యతపై ప్రత్యేక దృష్టి సారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ విషయమై సంబంధిత ఏఈని వివరణ కోరేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులోకి రాలేదు.

Next Story