- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిడమర్రు మోడల్ స్కూల్‌కు అపూర్వ స్పందన.. నో అడ్మిషన్స్ బోర్డు
మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తొలి మోడల్ స్కూల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది..

దిశ, మంగళగిరి : మంగళగిరి మండలం నిడమర్రు జెడ్పీ హైస్కూల్ ప్రాంగణంలో రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి, మంగళగిరి ఎమ్మెల్యే నారా లోకేష్ చొరవతో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన తొలి మోడల్ స్కూల్‌కు విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. అడ్మిషన్ల కోసం భారీగా దరఖాస్తులు రావడంతో అన్ని సీట్లు పూర్తికావడంతో పాఠశాల యాజమాన్యం "నో అడ్మిషన్స్" బోర్డులను ఏర్పాటు చేసింది.
మంత్రి నారా లోకేష్ ఆదేశాల మేరకు సుమారు రూ.16 కోట్ల వ్యయంతో, 5.2 ఎకరాల విస్తీర్ణంలో ఈ మోడల్ స్కూల్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ ప్రపంచ స్థాయి విద్య అందించాలనే లక్ష్యంతో అన్ని మౌలిక వసతులను కల్పించారు.
పాఠశాలలో ఆధునిక తరగతి గదులు, గ్రీన్ బోర్డులు, చార్ట్ బోర్డులు, డిజిటల్ బోధన కోసం ఐఎఫ్‌పీ ప్యానెల్స్, నాణ్యమైన టేబుల్స్, కుర్చీలు ఏర్పాటు చేశారు. విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రాధాన్యత ఇస్తూ ఫుట్‌బాల్ మైదానం, 200 మీటర్ల రన్నింగ్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, ఫ్లడ్‌లైట్స్, హ్యాండ్‌బాల్, బాస్కెట్‌బాల్, బాల్ బ్యాడ్మింటన్, వాలీబాల్ కోర్టులతో పాటు మల్టీ స్పోర్ట్స్ ఇండోర్ స్టేడియాన్ని నిర్మించారు. సుమారు 400 మంది కూర్చునే సామర్థ్యంతో యాంఫీ థియేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
శాస్త్రీయ ఆలోచనలను పెంపొందించేలా సైన్స్ మ్యూజియం, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, కంప్యూటర్ ల్యాబ్‌లు, ఆటల్ టింకరింగ్ ల్యాబ్, ఆధునిక గ్రంథాలయం అందుబాటులో ఉంచారు. 500 మంది విద్యార్థులు ఒకేసారి భోజనం చేసే డైనింగ్ హాల్, ఆర్వో తాగునీటి ప్లాంట్, 40 సీసీ కెమెరాలతో భద్రతా వ్యవస్థ, ప్రత్యేక పార్కింగ్, కిచెన్ గార్డెన్, చిన్నారుల కోసం చిల్డ్రన్స్ పార్క్‌ను ఏర్పాటు చేశారు.
ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు విద్యార్థుల కోసం 28 తరగతి గదులు, తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్ వరకు 12 ప్రత్యేక తరగతి గదులు నిర్మించారు. చిన్నారుల్లో చదువుపై ఆసక్తి పెంచేలా గోడలపై ఆకర్షణీయమైన విద్యా చిత్రాలు రూపొందించారు. సాంకేతికత ఆధారిత బోధనతో ఈ పాఠశాల ప్రభుత్వ విద్యారంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పుతోందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు.
మోడల్ స్కూల్‌లో ప్రవేశాల కోసం తల్లిదండ్రులు పెద్దఎత్తున ఆసక్తి చూపడంతో అన్ని సీట్లు భర్తీ అయ్యాయి. దీంతో పాఠశాల ప్రాంగణంలో "నో అడ్మిషన్స్" బోర్డులు ఏర్పాటు చేశారు. భవిష్యత్తు తరాలకు నాణ్యమైన విద్య అందించే ఆదర్శ విద్యాసంస్థగా నిడమర్రు మోడల్ స్కూల్ నిలవనుందని స్థానికులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






