తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు: మంత్రి జూపల్లి కృష్ణారావు

by Vemula.Srinu Prasad |

పర్యాటక, ఆతిథ్య రంగ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి దక్కిన గౌరవమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ..

తెలంగాణ పర్యాటక రంగానికి జాతీయ గుర్తింపు: మంత్రి జూపల్లి కృష్ణారావు
X

దిశ, తెలంగాణ బ్యూరో: పర్యాటక, ఆతిథ్య రంగ అభివృద్ధిలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంస్కరణలను నీతి ఆయోగ్ ప్రశంసించడం రాష్ట్రానికి దక్కిన గౌరవమని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హర్షం వ్యక్తం చేశారు. ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన అనలాకింగ్ గ్రోత్ ఇన్ టూరిజం అండ్ హాస్పిటాలిటీ సెక్టర్ నివేదికలో పర్యాటక రంగంలో తెలంగాణ అమలు చేస్తున్న విధానాలను ప్రత్యేకంగా ప్రస్తావించడం ఆనందదాయకమని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పరంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలను ఇతర రాష్ట్రాలు కూడా పరిశీలించాలని నీతి ఆయోగ్ సూచించడం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు లభించిన గుర్తింపు అని అన్నారు. హోటళ్ల నిర్మాణానికి సంబంధించి నిబంధనల సరళీకరణ, పెట్టుబడిదారులకు అనుకూల విధానాలు, భూమి వినియోగంలో వెసులుబాటు, ఫ్లోర్ ఏరియా రేషియో (ఎఫ్ఏఆర్) పెంపు, పార్కింగ్ నిబంధనల సరళీకరణ, సింగిల్ విండో విధానం బలోపేతం వంటి చర్యలు తెలంగాణలో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించాయని మంత్రి జూపల్లి తెలిపారు.

సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన తెలంగాణ పర్యాటక విధానం 2025 - 2030 ఇప్పటికే విశేష ఫలితాలను ఇస్తోందని, ఈ విధానం ద్వారా దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడిదారుల నుంచి విశేష స్పందన లభిస్తోందన్నారు. ఇప్పటికే వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు మార్గం సుగమమైందని జూపల్లి కృష్ణారావు తెలిపారు. గతంలో కూడా తెలంగాణ పర్యాటక రంగంలోని పలు ఉత్తమ కార్యక్రమాలు, పర్యాటక ప్రాంతాలకు నీతి ఆయోగ్ నివేదికల్లో స్థానం దక్కిందని ఆయన గుర్తు చేశారు.

తాజాగా మరోసారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణను ఆదర్శంగా పేర్కొనడం రాష్ట్ర పర్యాటక రంగం సరైన దిశలో ముందుకు సాగుతోందనడానికి నిదర్శనమని మంత్రి జూపల్లి అన్నారు. భవిష్యత్తులో పెట్టుబడిదారులకు మరింత అనుకూలమైన విధానాలు అమలు చేస్తూ, ప్రపంచ స్థాయి పర్యాటక మౌలిక వసతులు కల్పించి తెలంగాణను దేశంలోనే అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.

Next Story