స్కూళ్లు, కాలేజీల్లో గంజాయిపై విద్యార్థులకు పోలీసుల అవగాహన

by Malleboina Mahesh |

పాఠశాలలు, కాలేజీల్లో గంజాయి, డ్రగ్స్ మహమ్మారిపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు డీజీపీ సీవీ ఆనంద్‌ను వైఏసీ (YAC) బృందం కలిసింది.

స్కూళ్లు, కాలేజీల్లో గంజాయిపై విద్యార్థులకు పోలీసుల అవగాహన
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో రోజురోజుకు విస్తరిస్తున్న గంజాయి, డ్రగ్స్ మహమ్మారిని సమూలంగా నిర్మూలించేందుకు పోలీసు శాఖ చేస్తున్న కృషిలో తాము సైతం భాగస్వాములవుతామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ ముందుకొచ్చింది. తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్‌ను శుక్రవారం వైఏసీ బృందం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా డీజీపీకి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపింది. అనంతరం వైఏసీ ఫౌండర్ రాజేంద్ర పల్నాటి డీజీపీతో మాట్లాడుతూ.. గత పదిహేనేళ్లుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అవినీతి నిర్మూలన కోసం తమ సంస్థ వినూత్న కార్యక్రమాలతో ముందుకెళ్తోందని వివరించారు. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలల్లోని విద్యార్థులకు అవినీతిపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో, ప్రస్తుతం సమాజాన్ని పట్టి పీడిస్తూ యువత భవితను నాశనం చేస్తున్న గంజాయి, డ్రగ్స్ మహమ్మారిపై కూడా విద్యార్థుల్లో చైతన్యం తెచ్చేందుకు తమ వంతు బాధ్యతగా అవగాహన కల్పిస్తామని చెప్పారు.

ఇందుకు సంబంధించి తమకు అవకాశం ఇవ్వడంతో పాటు, తగిన సహకారం అందించాలని డీజీపీని కోరారు. వైఏసీ బృందం విజ్ఞప్తిపై డీజీపీ సీవీ ఆనంద్ సానుకూలంగా స్పందించారు. విద్యార్థులను,యువతను కాపాడేందుకు స్వచ్ఛంద సంస్థలు ఇలా ముందుకు రావడం ఎంతో సంతోషకరమైన, మంచి పరిణామమని ఆయన అభినందించారు. డ్రగ్స్ నిర్మూలన పై అవగాహన కార్యక్రమాల నిర్వహణ కోసం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఈగిల్ ఫోర్స్ డైరెక్టర్‌ను కలిసి మాట్లాడాలని డీజీపీ సూచించారు. ఈ మేరకు వైఏసీ ప్రతినిధులు ఇచ్చిన వినతిపత్రంపై ఆయన స్వయంగా రాసి వారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఏసీ గ్రేటర్ అధ్యక్షుడు కొన్నె దేవేందర్, ప్రతినిధులు శ్రీధర్ రెడ్డి, వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Next Story