సాధారణ బదిలీలా… యాక్షన్ బదిలీలా..?

by Batti.Sumithra |

వైరా డివిజన్ పరిధిలోని చింతకాని, బోనకల్, మధిర రూరల్ మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్నాయి.

సాధారణ బదిలీలా… యాక్షన్ బదిలీలా..?
X

దిశ, చింతకాని : వైరా డివిజన్ పరిధిలోని చింతకాని, బోనకల్, మధిర రూరల్ మండలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్నాయి. ఈ మూడు మండలాల పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారులు ఒక్కసారిగా బదిలీ కావడంతో స్థానిక ప్రజల్లో పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ బదిలీలు చేపట్టారు. అయితే అవతరణ దినోత్సవం ముగిసిన వారం రోజుల తర్వాత ఆకస్మికంగా ఈ బదిలీలు జరగడం చర్చనీయాంశమైంది. ఈ బదిలీలు సాధారణ పరిపాలనా చర్యలో భాగమా, లేక ఏదైనా యాక్షన్‌లో భాగమా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

జూన్ 5వ తేదీ తెల్లవారుజామున బోనకల్–ఖమ్మం ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చింతకాని మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ వార్డు సభ్యుడు మాతంగి నాగరాజు (34) అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి సంబంధించిన వివరాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కంచికచర్ల ప్రాంతం నుంచి ఖమ్మం జిల్లా కేంద్రానికి అక్రమంగా ఇసుక తరలింపు జరుగుతున్న విషయం పోలీసుల దృష్టికి వచ్చింది. రాత్రి వేళల్లో భారీ వాహనాల ద్వారా కంచికచర్ల, నందిగామ, మధిర, బోనకల్, చింతకాని మార్గంగా ఖమ్మం జిల్లా కేంద్రానికి అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న సమయంలో లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ఈ ఘటన అనంతరం పోలీసు కమిషనర్ సునీల్ దత్, వైరా ఏసీపీ సారంగపాణి కలిసి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించినట్లు సమాచారం. ఈ క్రమంలోనే మూడు మండలాల పోలీసు అధికారులను ఒక్కసారిగా బదిలీ చేశారు. ఆయా స్టేషన్లలో విధులు నిర్వహించిన అధికారులను ఖమ్మం జిల్లా పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్ చేయడంతో ప్రజల్లో మరిన్ని సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

అంతర్రాష్ట్ర సరిహద్దుల్లో తగిన భద్రతా చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారా ? లేక మరే ఇతర కారణాలతో ఈ బదిలీలు జరిగాయా అనే అంశాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం మూడు పోలీస్ స్టేషన్లలో బాధ్యతలు స్వీకరించిన సబ్‌ ఇన్‌స్పెక్టర్లు తమ సేవా రికార్డుల్లో మంచి గుర్తింపు పొందిన అధికారులు కావడంతో, శాంతిభద్రతల పరిరక్షణతో పాటు అక్రమ కార్యకలాపాల పై కఠిన చర్యలు తీసుకునే ఉద్దేశంతోనే వారిని నియమించినట్లు తెలుస్తోంది. ఈ ప్రాంతంలో ఇసుక మాఫియాకు అడ్డుకట్ట వేయడానికి నిజాయితీ గల పోలీసు అధికారుల అవసరం ఎంతగానో ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం పోలీసు అధికారులు మరింత కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

వైరా ఏసీపీ సారంగపాణి ఇసుక మాఫియాకు హెచ్చరిక..

ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మం జిల్లాకు అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న కీలక నిందితుడిని చింతకాని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ కేసు విచారణలో భాగంగా, ఆంధ్రప్రదేశ్ నుంచి ఖమ్మంకు అక్రమ ఇసుక రవాణాను నిర్వహిస్తున్న ప్రధాన నిర్వాహకుడిగా గుర్తించిన ఖమ్మం నగరంలోని రమణగుట్ట ప్రాంతానికి చెందిన దేవేందర్ (35) అనే లారీ యజమానిని అరెస్టు చేసి న్యాయస్థానం ముందు హాజరుపరిచినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం కోర్టు అతనికి రిమాండ్ విధించినట్లు వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు ఉచిత ఇసుక పంపిణీ విధానాన్ని అమలు చేస్తుండగా, కొందరు వ్యక్తులు దానిని ఆసరాగా తీసుకుని అక్రమంగా తెలంగాణ రాష్ట్రానికి ఇసుక తరలించి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమ ధనార్జనకు పాల్పడుతున్నారని ఏసీపీ సారంగపాణి పేర్కొన్నారు. ఇలాంటి వ్యవస్థీకృత నేరాల ద్వారా తెలంగాణ ప్రభుత్వ ఆదాయానికి భారీ నష్టం కలిగిస్తున్న వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైరా డివిజన్ పరిధిలో నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని, ఎలాంటి అక్రమ రవాణాకూ అవకాశం ఇవ్వబోమని తెలిపారు. పోలీసు తనిఖీలను మరింత ముమ్మరం చేస్తామని స్పష్టం చేశారు. అక్రమ ధనార్జన కోసం ఇలాంటి వ్యవస్థీకృత నేరాలకు పాల్పడితే ఉపేక్షించబోమని, అవసరమైతే సస్పెక్ట్ షీట్లు కూడా ఓపెన్ చేస్తామని ఏసీపీ సారంగపాణి హెచ్చరించారు.

Next Story