- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డెడ్ స్టోరేజీలోకి పోచారం ప్రాజెక్ట్
నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు జీవనాడిగా ఉన్న పోచారం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీలోకి చేరింది.

దిశ, నాగిరెడ్డిపేట్ : నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాలకు జీవనాడిగా ఉన్న పోచారం ప్రాజెక్ట్ డెడ్ స్టోరేజీలోకి చేరింది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడిచినా వర్షాలు లేకపోవడంతో ప్రాజెక్టులోకి చుక్క నీరూ రాలేదు. దీంతో వేసవి ముగియక ముందే నీటిమట్టం తీవ్రంగా పడిపోయి ఖరీఫ్ సాగుపై అనిశ్చితి నెలకొంది.
అడుగంటిన నీటిమట్టం..
ప్రాజెక్టు పూర్తి నీటి సామర్థ్యం 1.82 టీఎంసీలు. ప్రస్తుతం డెడ్ స్టోరేజీ స్థాయి కంటే తక్కువగా కేవలం 0.103 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని ఇరిగేషన్ ఏఈ అక్షయ్ తెలిపారు. రోజురోజుకూ ఎండ తీవ్రత పెరగడంతో నీటిమట్టం మరింత తగ్గుతోంది. నాగిరెడ్డిపేట్, ఎల్లారెడ్డి మండలాల పరిధిలో 10,500 ఎకరాల ఆయకట్టుకు పోచారం ప్రాజెక్ట్ నుంచే ఖరీఫ్ సీజన్‌లో సాగునీరు అందుతుంది. రబీలో మాత్రం ఒక ఏడాది ఏ జోన్‌కు నాగిరెడ్డిపేట్, మరో ఏడాది బీ జోన్‌కు ఎల్లారెడ్డికి నీరిస్తారు.
గతేడాది పూర్తిస్థాయి.. ఈసారి డెడ్ స్టోరేజీ
గత సంవత్సరం జూన్ నుంచే భారీ వర్షాలు కురవడంతో ప్రాజెక్టులోకి భారీగా వరదనీరు చేరింది. ఆగస్టు 15 నాటికే పోచారం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటితో పొంగిపొర్లింది. జూన్ రెండో వారంలోనే ఆయకట్టులో వరి నాట్లు పూర్తయ్యాయి. అయితే ఈసారి వానాకాలం ప్రారంభమై నెలన్నర గడిచినా భారీ వర్షాలు కురవలేదు. నైరుతి రుతుపవనాలు బలహీనంగా ఉండటం, జూలై–ఆగస్టులో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం ఉంటుందని భారత వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరించడం రైతుల ఆందోళనను రెట్టింపు చేస్తోంది.
వరి నాట్ల కోసం వర్షం కోసం ఎదురుచూపు..
ఖరీఫ్ సాగు కోసం ఆయకట్టు రైతులు ఇప్పటికే భూములను దుక్కి దున్ని, వరి నారుమడులు వేసి సిద్ధంగా ఉన్నారు. బోరు బావులున్న రైతులు కొంతమేర నాట్లు వేస్తున్నా, ప్రాజెక్ట్ ఆయకట్టు రైతులు మాత్రం వర్షం కోసం ఆగాల్సిన పరిస్థితి. "వరుణదేవుడు ఎప్పుడు కరుణిస్తాడో, వర్షాలు ఎప్పుడు కురుస్తాయో" అంటూ ప్రతిరోజూ ఆకాశం వైపు చూస్తున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వర్షాభావంలో పునరుజ్జీవమే ఆధారం.. మంగలి రాజు, రైతు, పోచారం
మాకు ప్రాజెక్ట్ ఆయకట్టు కింద 8 ఎకరాల సాగుభూమి ఉంది. గత ఏడాది అప్పటికే ప్రాజెక్టులో నీరు ఉండడంతో వరి నాట్లు వేయడం పూర్తి చేశాం. కానీ ఈసారి ఇప్పటికీ వర్షాలు కురవక, ప్రాజెక్టు నిండకపోవడంతో నాట్లు వేయలేకపోయాం. వానల కోసం రోజూ ఎదురుచూస్తున్నాం. వరుణదేవుడు కరుణించాలి. ప్రాజెక్టు నిండితేనే నాట్లు వేస్తాం.
ఖరీఫ్ సాగు పై అనిశ్చితి
ప్రస్తుత నీటిమట్టంతో ఖరీఫ్‌లో సాగునీరు ఇచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ జూలై, ఆగస్టులోనూ భారీ వర్షాలు కురవకపోతే ఈ సీజన్‌లో ఆయకట్టు సాగు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారనుంది. ఇప్పటికే పెట్టుబడులు పెట్టి నారుమడులు సిద్ధం చేసిన రైతులు వర్షం కోసం చివరి ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆయకట్టు రైతులను ఆదుకోవాలని వారు కోరుతున్నారు.






