సనంద్‌లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ

by Malleboina Mahesh |

గుజరాత్‌లోని సనంద్‌లో రూ. 3,300 కోట్ల కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోదీ. రోజుకు 60 లక్షల చిప్‌ల ఉత్పత్తి లక్ష్యం. మేక్ ఇన్ ఇండియాలో మరో కీలక మైలురాయి.

సనంద్‌లో కేన్స్ సెమీకండక్టర్ ప్లాంట్‌ను ప్రారంభించిన ప్రధాని మోడీ
X

దిశ, వెబ్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) గుజరాత్‌లోని సనంద్ జిఐడిసి (GIDC)లో కేన్స్ సెమీకాన్ ప్లాంట్‌ (Cannes Semicon Plant)ను ప్రారంభించారు. భారతదేశాన్ని గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌గా మార్చే లక్ష్యంగా.. సుమారు రూ. 3,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేసిన ఈ ప్లాంట్, దేశంలో వాణిజ్య ఉత్పత్తిని ప్రారంభించిన రెండో సెమీకండక్టర్ యూనిట్ (Semiconductor unit)గా నిలిచింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. 21వ శతాబ్దపు భారతదేశం కేవలం మార్పులను చూసేదిగా మాత్రమే ఉండదని, ఆ మార్పులకు నాయకత్వం వహిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత బడ్జెట్‌లో ప్రకటించిన 'సెమీకండక్టర్ మిషన్ 2.0' దేశాన్ని ఈ రంగంలో స్వయంసమృద్ధిగా మారుస్తుందని ఆయన పేర్కొన్నారు.

ఈ ప్లాంట్ రోజుకు సుమారు 60 లక్షల నుంచి 70 లక్షల చిప్‌లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇక్కడ తయారయ్యే 'ఇంటెలిజెంట్ పవర్ మోడ్యూల్స్' (IPMs) ముఖ్యంగా ఎలక్ట్రిక్ వాహనాలు (EVలు), పారిశ్రామిక వ్యవస్థలు, గృహోపకరణాలలో ఉపయోగించబడతాయి. వీటిని కాలిఫోర్నియాకు చెందిన ఆల్ఫా అండ్ ఒమేగా సెమీకండక్టర్ (AOS) సంస్థకు ఎగుమతి చేయనున్నారు. ఈ ప్లాంట్ ద్వారా స్థానికంగా పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభించడమే కాకుండా, ప్రపంచ సెమీకండక్టర్ సరఫరా గొలుసులో (Supply Chain) భారత్ కీలక భాగస్వామి గా మారుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆకాంక్షించారు.

Next Story