ప్రజలే నా కుటుంబం... మే 4న విజయం మనదే అంటూ ప్రధాని మోదీ భావోద్వేగం

by Malleboina Mahesh |

ప్రధాని మోదీ బెంగాల్ ప్రచార ముగింపు! "మే 4 తర్వాత బిజెపి ప్రభుత్వ ప్రమాణ స్వీకారానికి వస్తా" అని ధీమా వ్యక్తం చేసిన మోదీ. ప్రజలే నా కుటుంబం అంటూ భావోద్వేగ ప్రసంగం.

ప్రజలే నా కుటుంబం... మే 4న విజయం మనదే అంటూ ప్రధాని మోదీ భావోద్వేగం
X

దిశ, వెబ్ డెస్క్: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల (Bengal Assembly Elections) ప్రచారం వాడివేడిగా కొనసాగుతోంది. ఈ రోజు సాయంత్రంతో ప్రచారం ముగియనుండటంతో ప్రధాని మోడీ, అమిత్ షా, సీఎం యోగీ ఆదిత్యనాథ్ సహా ఇతర కీలక నేతలు ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఈ క్రమంలో బరాక్‌పూర్‌లో జరిగిన తన చివరి బహిరంగ సభలో ప్రధాని నరేంద్ర మోడీ (Prime Minister Narendra Modi) పాల్గొని అత్యంత భావోద్వేగంగా ప్రసంగించారు. సుమారు మూడు దశాబ్దాలుగా దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నానని, బీజేపీ కార్యకర్తగా పార్టీ అప్పగించిన ప్రతి బాధ్యతను చిత్తశుద్ధితో నిర్వహించానని ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రజలే నా కుటుంబం

"నేను ఇల్లు వదిలి వచ్చినప్పటి నుండి, మీ అందరి మధ్యే నాకు అసలైన ఆనందం, ప్రశాంతత లభించాయి. మీరే నా కుటుంబం" అంటూ ప్రధాని బెంగాల్ ప్రజలపై తనకున్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఉదయాన్నే వేలాది మంది ప్రజలు హెలిప్యాడ్ నుంచి సభా ప్రాంగణం వరకు రోడ్డుకు ఇరువైపులా నిలబడి తనకు ఆశీస్సులు అందించడం చూస్తుంటే మాటలు రావడం లేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

మే 4న బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి వస్తా

ఈ సారి బెంగాల్‌లో మార్పు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తూ ప్రధాని సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఈ ఎన్నికల్లో ఇదే నా చివరి సభ. మే 4వ తేదీన వెలువడే ఫలితాల తర్వాత, బెంగాల్‌లో బీజేపీ ప్రభుత్వ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి నేను ఖచ్చితంగా హాజరవుతాననే నమ్మకంతో ఇక్కడి నుండి తిరిగి వెళ్తున్నాను. ఈ విశ్వాసం నాలో మరింత ఉత్సాహాన్ని నింపుతోంది" అని మోడీ పేర్కొన్నారు. అలాగే బిజెపి కార్యకర్తగా ఎన్నికల బాధ్యతలను స్వీకరించడం తన విధిలో భాగమని, బెంగాల్ ప్రజల ఆశీస్సులతో రాష్ట్రంలో కొత్త శకం ప్రారంభం కాబోతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Next Story