‘సోలార్ రైజింగ్’ ఎక్కడ?

by Muthe.Rajitha |

మార్చి చివరి నాటికి గడువు ముగియడానికి వస్తున్నా, 'పీఎం కుసుం ప్రాజెక్టు' లక్ష్యం నెరవేరలేదు.

‘సోలార్ రైజింగ్’ ఎక్కడ?
X

దిశ, తెలంగాణ బ్యూరో: సోలార్ యూనిట్ల ఏర్పాటుతో ఆర్థికంగా బలపడాలని భావిస్తున్న రైతులు, సౌర విద్యుత్ ఉత్పత్తిలో అగ్రపథాన నడవాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ సంకల్పం నెరవేరడం లేదు. క్షేత్రస్థాయిలో గ్రీన్ ఎనర్జీ సాధించేందుకు అధికారుల నుంచి రైతులకు సరైన ప్రోత్సాహం లభించట్లేదు. వ్యవసాయంలో సౌర విద్యుత్ శక్తిని ప్రోత్సహించడం, సౌర పంపుల ఏర్పాటు, బంజరు భూములపై సౌర విద్యుత్ కేంద్రాల ఏర్పాటు, మిగులు సోలార్ పవర్‌ను అమ్మడం రైతులకు అదనపు ఆదాయం తెచ్చిపెట్టే లక్ష్యంతో కేంద్రం 2019లో పీఎం కుసుం(ప్రధానమంత్రి కిసాన్ ఊర్జా సురక్ష ఏవం ఉత్థాన్ మహాభియాన్) పథకాన్ని ప్రారంభించింది. ఇందులో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను పూర్తిగా వ్యవసాయం కోసమే వినియోగించాలని భావిస్తున్నారు. అయితే మార్చి నాటికి ఈ పథకం గడువు సైతం ముగియనుండగా గ్రౌండింగ్‌లో ఆశించిన పురోగతి కనిపించకపోవడం గమనార్హం.

రైతులను పట్టించుకోని డిస్కంలు

పీఎం కుసుం పథకాన్ని రాష్ట్రంలోని రైతులకు అందించేందుకు రేవంత్ ప్రభుత్వం ముందుకొచ్చింది. రాష్ట్రంలో సుమారు 4500 ఎకరాల్లో రూ.6 వేల కోట్ల పెట్టుబడితో 883 మంది రైతులు 1,450 మెగావాట్ల సోలార్ పవర్ ఉత్పత్తి చేసేందుకు డిస్కంలతో ఒప్పందం చేసుకున్నారు. ఈ ఏడాది మార్చి నాటికి ప్రాజెక్టును పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్న రెడ్కో, పవర్‌ను కొనాల్సిన డిస్కంలు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతులు ఉత్పత్తి చేసిన సోలార్ విద్యుత్ టీజీఎస్పీడీసీఎల్, టీజీఎన్పీడీసీఎల్ కొనాల్సి ఉంది. కానీ అనుమతుల కోసమే వారిని తమ ఆఫీసుల చుట్టూ తిప్పుకుంటున్నాయి. స్థానికంగా ఉన్న సబ్ స్టేషన్ల నుంచి సోలార్ ప్లాంటు వద్దకు వేసే ప్రత్యేక లైన్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి, వినియోగం జరగాల్సి ఉంది. అయితే కనీసం ఫీజబిలిటీ రిపోర్టులు ఇచ్చేందుకు అధికారులు కాలయాపన చేస్తున్నారు.

ముంచుకొస్తున్న గడువు

1450 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి టీజీ రెడ్కోతో ఒప్పందం చేసుకున్న రైతులు అందుకు అనుగుణంగా కార్యాచరణ చేపట్టినా అధికారుల నుంచి సహకారం లభించడం లేదు. డిస్కంలు, రెడ్ కో యూనిట్లను గ్రౌండింగ్ చేయడంలోనూ విఫలమయ్యారు. ఇప్పటివరకు 50 మెగావాట్ల సామర్థ్యానికి మించి గ్రౌండింగ్ కాలేదు. మార్చిలో పీఎం కుసుం ప్రాజెక్టు గడువు ముగిసిపోతే.. ఇప్పటి వరకు రైతులు, ప్రభుత్వం చేసిన కసరత్తు అంతా వృథా ప్రయాసే అవుతుంది. రైతులు ఏర్పాటు చేసుకునే ప్లాంట్ నుంచి స్థానిక సబ్ స్టేషన్ కు లింక్ చేసేందుకు ఫీజబిలిటీ రిపోర్టును అధికారులు ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. రైతులు, బ్యాంకర్లను సమన్వయం చేసి రుణాలు ఇప్పించే విషయంలో రెడ్కో అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదని రైతులు చెబుతున్నారు.

సోలార్ ప్లాంట్ కు కేంద్రం రాయితీ

రైతులు వ్యవసాయం లాభసాటి కాదని భావించినప్పుడు పీఎం కుసుం ద్వారా 0.5 మెగావాట్ల నుంచి 2 మెగావాట్ల వరకు సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అవకాశం ఉంటుంది. 0.5 మెగావాట్ ప్రాజెక్టుకు రెండెకరాల్లోపు, మెగావాట్ ప్రాజెక్టుకు మూడు నుంచి నాలుగు ఎకరాల్లోపు, రెండు మెగావాట్ల ప్రాజెక్టుకు ఏడెకరాల్లోపు భూమి అవసరం ఉంటుంది. 0.1 మెగావాట్ ప్రాజెక్టుకు రూ.రెండుకోట్లలోపు, ఒక మెగావాట్ ప్రాజెక్టుకు రూ.నాలుగు కోట్లలోపు, రెండు మెగావాట్ల ప్రాజెక్టు కోసం రూ.ఏడుకోట్ల లోపు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇందులో రైతులు 15శాతం మార్జిన్ మనీ భరిస్తే మిగతా మొత్తం బ్యాంకుల నుంచి రుణం తీసుకోవచ్చు. బ్యాంకు రుణానికి 9శాతం వడ్డీ ఉంటే, కేంద్రం మూడుశాతం వడ్డీ రాయితీ ఇవ్వనుంది. రైతులు 25ఏళ్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేస్తామని డిస్కంలతో ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది.

రైతులకు ఏం లాభం?

సోలార్ పవర్ ఉత్పత్తి చేసే రైతులకు యూనిట్ కు డిస్కంలు రూ.3.13చొప్పున చెల్లింపునకు ఒప్పందం చేసుకున్నాయి. ఒక మెగావాట్ విద్యుత్ ఉత్పత్తి కోసం రూ.నాలుగు కోట్ల లోపు పెట్టుబడి పెడితే ఏడాదిలో సుమారు 16,675,00 మెగావాట్ల యూనిట్లను ఉత్పత్తి చేసేందుకు అవకాశం ఉంటుంది. అందుకోసం యూనిట్ కు రూ.3.13 చొప్పున డిస్కంలు నేరుగా రైతు అకౌంట్ లో జమచేస్తాయి. దాదాపు మెగావాట్ సోలార్ ప్లాంట్ నుంచి ఏడాదికి రైతు ఖాతాలో రూ.52 లక్షలకు పైగానే సమకూరుతాయి. మెయింటనెన్స్ కోసం ఏడాదికి సుమారు రూ.6 నుంచి రూ.10 లక్షల వరకు ఖర్చయినా దాదాపు రూ.40 లక్షలకు పైగా ఆదాయం వస్తుందని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంకు లోన్ తీసుకున్నా సులభంగా ఈఎంఐ చెల్లించవచ్చని పేర్కొంటున్నారు.

గడువును పొడిగించాలని కేంద్రాన్ని కోరాం

రాష్ట్రంలో పీఎం కుసుం పథకానికి రైతులకు కోట్లాది రూపాయల అప్పులు ఇచ్చే క్రమంలో బ్యాంకులు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ఇప్పటికే కొన్ని యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయి. మార్చి నెలాఖరు వరకు అన్ని యూనిట్లను గ్రౌండింగ్ చేసే అవకాశం లేదు. అందుకే ఇటీవలే పీఎం కుసుం ప్రాజెక్టు గడువును మరో మూడు నెలల పాటు పొడిగించాలని కేంద్రాన్ని కోరాం. ఈ వేసవిలోపు రాష్ట్రంలో వెయ్యి మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. శాఖల మధ్య సమన్వయం లేకుండా ఉన్నతాధికారులు క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తున్నారు. రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం.

- అనిల, ఎండీ, టీజీ రెడ్కో

Next Story