పీఎం కిసాన్ 22వ విడత అప్‌డేట్.. ఫిబ్రవరి చివరి వారంలో రైతుల ఖాతాల్లో డబ్బులు

by Malleboina Mahesh |

పీఎం కిసాన్ 22వ విడత.. ఫిబ్రవరి చివరి వారంలో ₹2,000 జమ! ఈ-కేవైసీ పూర్తి చేయని వారికి నిధులు కట్.. వెంటనే స్టేటస్ చెక్ చేసుకొవాలని అధికారులు సూచనలు

పీఎం కిసాన్ 22వ విడత అప్‌డేట్.. ఫిబ్రవరి చివరి వారంలో రైతుల ఖాతాల్లో డబ్బులు
X

దిశ, వెబ్ డెస్క్: భారత ప్రభుత్వం.. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM-KISAN) పథకం కింద రైతులకు పెట్టుబడి సాయం ఇస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకంలో భాగంగా.. 22వ విడత నిధుల కోసం ఎదురుచూస్తున్న కోట్లాది మంది రైతులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించనుంది. అర్హులైన రైతుల ఖాతాల్లో ఫిబ్రవరి 22వ తేదీన, ఈ నెల చివరి వారంలో ₹2,000 చొప్పున జమ చేయాలని కేంద్రం యోచిస్తోంది. ఫిబ్రవరి 22న వీలు పడకపోతే, మార్చి మొదటి వారంలో హోలీ పండుగ కంటే ముందే నిధులు విడుదల చేసే అవకాశం ఉంది. సాధారణంగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అందించే ఈ నిధులను, గత ఏడాది నవంబర్ 19న 21వ విడతగా విడుదల చేసిన సంగతి తెలిసిందే.

కేంద్ర ప్రభుత్వం ఏటా మూడు విడతలుగా మొత్తం ₹6,000 ఆర్థిక సాయాన్ని నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి (DBT ద్వారా) జమ చేస్తుంది. అయితే, 22వ విడత నిధులు పొందాలంటే రైతులు ఖచ్చితంగా ఈ-కేవైసీ (e-KYC) పూర్తి చేయాలని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఈ ప్రక్రియను పూర్తి చేయని వారు వెంటనే పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ద్వారా, సమీపంలోని సీఎస్‌సీ (CSC) కేంద్రాల్లో ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ ద్వారా ఈ-కేవైసీ పూర్తి చేసుకోవచ్చు.

నిధుల జమలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా ఉండాలంటే ఈ-కేవైసీ తో పాటు ల్యాండ్ సీడింగ్ (Land Seeding), ఆధార్‌తో బ్యాంక్ ఖాతా అనుసంధానం తప్పనిసరి అని ప్రభుత్వం పేర్కొంటోంది. తమ పేర్లు లబ్ధిదారుల జాబితాలో ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి రైతులు పోర్టల్‌లోని 'బెనిఫిషియరీ స్టేటస్' ఆప్షన్‌ను తనిఖీ చేసుకోవచ్చు. త్వరలోనే కేంద్ర వ్యవసాయ శాఖ నిధుల విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువరించే అవకాశం ఉంది.

Next Story