- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పీఎం ఆవాస్ యోజన 2.0 జోరు.. పట్టణ పేదలకు రూ. 2.50 లక్షల ఆర్థిక సాయం
PMAY-U 2.0 కింద కొత్తగా 2.88 లక్షల ఇళ్లను కేంద్రం మంజూరు చేసింది. ఇందులో 1.60 లక్షల ఇళ్లు మహిళలకే కేటాయించగా, ఏపీ మరియు తెలంగాణ సహా 16 రాష్ట్రాలకు లబ్ధి చేకూరనుంది.

దిశ, వెబ్ డెస్క్: పట్టణాల్లో ఉన్న పేదలకు పీఎం ఆవాస్ యోజన 2.0 పథకం (PM Awas Yojana 2.0 Scheme) శుభవార్తను అందించింది. కేంద్ర ప్రభుత్వం పట్టణ పేదలకు సొంత ఇంటి కలను నిజం చేసే లక్ష్యంతో చేపట్టిన పథకం కింద మరో భారీ ముందడుగు వేసింది. తాజాగా నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో దేశవ్యాప్తంగా కొత్తగా 2.88 లక్షల (2,87,618) ఇళ్ల నిర్మాణానికి కేంద్ర గృహ నిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయంతో PMAY-U 2.0 పథకం ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటివరకు మంజూరైన మొత్తం ఇళ్ల సంఖ్య 13.61 లక్షలకు చేరింది. తాజా విడతలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 16 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లబ్ధి చేకూరనుంది.
ఈ కేటాయింపుల్లో కేంద్ర ప్రభుత్వం (Central Govt) సామాజిక సమతుల్యతకు, మహిళా సాధికారతకు పెద్దపీట వేసింది. మంజూరైన మొత్తం ఇళ్లలో సింహభాగం అంటే సుమారు 1.60 లక్షల ఇళ్లను మహిళల పేరుతోనే కేటాయించనున్నారు. అలాగే సామాజిక వర్గాల వారీగా చూస్తే.. ఓబీసీలకు 82,190 ఇళ్లు, ఎస్సీలకు 35,525, ఎస్టీలకు 9,773, సీనియర్ సిటిజన్లకు 22,581 ఇళ్లను కేటాయించారు. ట్రాన్స్‌జెండర్లకు సైతం ప్రత్యేకంగా 8 యూనిట్లు మంజూరు చేయడం విశేషం. అర్హులైన లబ్ధిదారులకు ఇంటి నిర్మాణ ఖర్చులో ప్రభుత్వం నుంచి రూ. 2.50 లక్షల వరకు నేరుగా ఆర్థిక సాయం అందనుంది.
ఈ పథకాన్ని ప్రధానంగా రెండు విభాగాల్లో అమలు చేస్తున్నారు. లబ్ధిదారులే స్వయంగా తమ స్థలంలో ఇల్లు నిర్మించుకునే 'బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్' (BLC) పద్ధతితో పాటు, ప్రభుత్వ భాగస్వామ్యంతో నిర్మించే 'అఫోర్డబుల్ హౌసింగ్ ఇన్ పార్టనర్‌షిప్' (AHP) ద్వారా ఈ గృహాలను అందుబాటులోకి తీసుకురానున్నారు. పట్టణ ప్రాంతాల్లో అద్దె ఇళ్లలో ఉంటూ ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు (EWS), అల్ప ఆదాయ వర్గాలకు (LIG) ఈ పథకం ఒక గొప్ప వరమని కేంద్రం పేర్కొంది. నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి, లబ్ధిదారులకు గృహప్రవేశం కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్రం సమన్వయం చేసుకుంటోంది.
అర్హత ప్రమాణాలు
ఈ పథకం కింద లబ్ధి పొందాలంటే దరఖాస్తుదారుడి కుటుంబ వార్షిక ఆదాయం రూ. 3 లక్షల నుంచి రూ. 9 లక్షల లోపు ఉండాలి. దేశంలో ఎక్కడా లబ్ధిదారుడికి, వారి కుటుంబ సభ్యులకు సొంత పక్కా ఇల్లు ఉండకూడదు. ముఖ్యంగా మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, సీనియర్ సిటిజన్లకు ఈ పథకంలో ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తారు. ఇంటి యాజమాన్యం తప్పనిసరిగా మహిళ పేరు మీద- పురుషుడితో కలిపి ఉమ్మడి పేరు మీద ఉండాలి.
దరఖాస్తు విధానం
పైన తెలిపిన అన్ని అర్హతలు ఉన్న వారు ఆన్‌లైన్‌లో https://pmay-urban.gov.in/ వెబ్‌సైట్ ద్వారా, నేరుగా స్థానిక మున్సిపల్ కార్యాలయం, వార్డు సచివాలయంలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు సమయంలో ఆధార్ కార్డు, ఆదాయ ధృవీకరణ పత్రం, నివాస ధృవీకరణ, బ్యాంకు పాస్‌బుక్ కాపీని సమర్పించాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న తర్వాత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపి, అర్హులైన వారికి రూ. 2.50 లక్షల వరకు ఆర్థిక సహాయాన్ని మంజూరు చేస్తారు.





