- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతిపక్ష పాత్ర పోషించండి.. బీఆర్ఎస్ నేతలకు బీర్ల ఐలయ్య హితవు
ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పటికైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య అన్నారు.

దిశ, వెబ్‌డెస్క్: ప్రజాస్వామ్యబద్ధంగా ఇప్పటికైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ (BRS) ప్రతిపక్ష పాత్ర పోషించాలని ప్రభుత్వం విప్ బీర్ల ఐలయ్య (Beerla Ilaiah) అన్నారు. ఇవాళ అసెంబ్లీ (Assembly)లోని సీఎల్పీ మీడియా సెంటర్‌లో ఆయన మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజాస్వామ్యంలో అత్యంత దుర్మార్గపు చర్య అని మండిపడ్డారు. కేవలం అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం కల్వకుంట్ల కుటుంబం ఎంతటి నీచానికైనా పాల్పడుతుందని ఈ ఉదంతం మరోసారి నిరూపితమైందని అన్నారు. హరీష్ రావు ఆరడుగులు పెరిగాడు కానీ, ఆయన తెలివితేటలు మాత్రం మోకాలిలో ఉన్నట్లున్నాయని ఎద్దేవా చేశారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం స్వయంగా హరీష్ రావు ఫోన్‌తో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుల ఫోన్లను కూడా ట్యాప్ చేసిందని ఆరోపించారు. ఆ ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారం వల్లే హరీష్ రావుకు గతంలో మంత్రి పదవి ఇవ్వకుండా పక్కన పెట్టారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.
సొంత పార్టీ నేతలపైనే నిఘా..
ఈటల రాజేందర్ (Etala Rajender)ను పార్టీ నుంచి పంపించడం వెనుక కూడా ట్యాపింగ్ కుట్రే ఉందని బీర్ల ఐలయ్య ఆరోపించారు. ఈటల రాజేందర్ భార్య జమున (Jamuna) ఫోన్‌ను సైతం ట్యాప్ చేసి, ఆ సమాచారంతోనే ఆయనను ఇబ్బందులకు గురిచేసి పార్టీ నుంచి పంపేశారని గుర్తుచేశారు. ఇంతటి అక్రమాలకు పాల్పడి కూడా, ఇప్పుడు కేటీఆర్ తానేదో ఘనకార్యం చేసినట్లుగా మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.
సిట్ విచారణలో ప్రభుత్వం జోక్యం చేసుకోదు..
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రస్తుతం జరుగుతున్న సిట్ విచారణలో ప్రభుత్వం ఏ మాత్రం జోక్యం చేసుకోదని బీర్ల ఐలయ్య స్పష్టం చేశారు. ఎవరిని విచారించాలి, ఎప్పుడు పిలవాలి అనేది పూర్తిగా సిట్ అధికారుల పరిధిలోని అంశమని అన్నారు. విచారణలో భాగంగా హరీష్ రావుకు అధికారులు చుక్కలు చూపించారని, దీంతో ఆయన మైండ్ బ్లాంక్ అయి బయటకొచ్చి ఏదేదో మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, పార్లమెంట్ ఎన్నికల్లో సున్నా సీట్లు వచ్చినా బీఆర్ఎస్ నాయకులకు ఇంకా బుద్ధి రావడం లేదని ఐలయ్య ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో చర్చకు తోకముడిచిన బీఆర్ఎస్ నాయకులు, బయట మాత్రం పోరాట యోధులుగా ఫోజులు ఇవ్వడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇకనైనా ప్రజాస్వామ్యబద్ధంగా బీఆర్ఎస్ ప్రతిపక్ష పాత్ర పోషించాలని హితవు పలికారు.
Read More..






