లక్ష టన్నుల లక్ష్యం.. దూసుకుపోతున్న నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ

by Batti.Sumithra |

సిద్దిపేట జిల్లా నర్మెటలో టన్నుకు రూ.23,852 ధరతో గంటకు 30 టన్నుల పామాయిల్ గెలలను శుద్ధి చేస్తూ లక్ష టన్నుల లక్ష్యంతో ఆయిల్‌ ఫెడ్ ఫ్యాక్టరీ దూసుకుపోతోందని ప్రభుత్వం పేర్కొంది.

లక్ష టన్నుల లక్ష్యం.. దూసుకుపోతున్న నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ
X

దిశ, నంగునూరు : సిద్దిపేట జిల్లా నర్మెటలో టన్నుకు రూ.23,852 ధరతో గంటకు 30 టన్నుల పామాయిల్ గెలలను శుద్ధి చేస్తూ లక్ష టన్నుల లక్ష్యంతో ఆయిల్‌ ఫెడ్ ఫ్యాక్టరీ దూసుకుపోతోందని ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు ఆదివారం ప్రభుత్వం తన అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. నర్మెట ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీతో పాటు రాష్ట్రంలో మరో ఏడు కర్మాగారాలు 2027 నాటికి అందుబాటులోకి రానున్నాయని ప్రభుత్వం పేర్కొంది. సిద్దిపేటలో రూ.40 కోట్లతో రిఫైనరీ యూనిట్‌ 2027 నాటికి అందుబాటులోకి వస్తుందని పేర్కొంది.

ఆయిల్ పామ్ గెలలు టన్నుకు రూ.23,852 ధర పలికి సరికొత్త రికార్డు సృష్టించిందని పేర్కొంది. ఆరు నెలల్లో టన్ను ధర రూ.4,158లు పెరగడం విశేషం. మే నెలలో టన్ను గెలల ధర రూ.23,501లు ఉండగా తాజాగా రూ.351లు పెరిగింది. దీంతో ఆయిల్ పామ్ గెలలకు టన్ను ధర రూ.23,852కు చేరిందని ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు ఇదే అత్యధికమని చెప్పారు. గత డిసెంబర్ నెలలో ఆయిల్ పామ్ గెలలకు టన్ను ధర రూ.19,694లు ఉండగా ఆరు నెలల్లోనే టన్నుకు రూ.4,158లు పెరగడం విశేషం. కాగా రాష్ట్రంలో దాదాపు మూడు లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగవుతోంది. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ఆయిల్ పామ్ సాగు చేసిన రైతులు అధిక లాభాలను పొందుతున్నారని ఫ్యాక్టరీ అధికారులు ప్రకటించారు.

Next Story