నిబంధనలు పాటించండి.. ప్రాణాలు కాపాడుకోండి

by Taduka Kalyani |

రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సంతోష్‌నగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు.

నిబంధనలు పాటించండి.. ప్రాణాలు కాపాడుకోండి
X

దిశ, చంపాపేట్ : రోడ్డు ప్రమాదాల నివారణ, ట్రాఫిక్ నిబంధనలపై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఐఎస్ సదన్ డివిజన్ పరిధిలోని సంతోష్‌నగర్ చౌరస్తా వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సీఐ మహమ్మద్ ఆసిఫ్ ఆధ్వర్యంలో చేపట్టిన ఈ తనిఖీల్లో వాహనదారులకు రోడ్డు భద్రతా నియమాలపై అవగాహన కల్పించడంతో పాటు నిబంధనలు ఉల్లంఘించిన వారిని గుర్తించారు. తనిఖీల సందర్భంగా హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనాలు నడిపే వారు, చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ లేని వారు, ఇన్సూరెన్స్ పత్రాలు లేకుండా వాహనాలు నడిపే వారు, సీటు బెల్ట్ ధరించని కార్ డ్రైవర్లు, రాంగ్‌రూట్‌లో ప్రయాణిస్తున్న వాహనదారులను గుర్తించి హెచ్చరించారు.ట్రాఫిక్ నిబంధనలు పాటించని వారిపై మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 181, 183, 192, 207 కింద కేసులు నమోదు చేసి అవసరమైతే వాహనాలను సీజ్ చేయనున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. అనుమతి లేకుండా రోడ్లపై తిరిగే లోడ్ వాహనాలు, ప్రమాదకరంగా రాంగ్‌రూట్‌లో ప్రయాణించే వాహనాలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మహమ్మద్ ఆసిఫ్ మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు తన గమ్యానికి సురక్షితంగా చేరుకోవడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు. కుటుంబ సభ్యుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బాధ్యతాయుతంగా వాహనాలు నడపాలని, రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.

సంతోష్‌నగర్‌లో ట్రాఫిక్ పోలీసుల ప్రత్యేక డ్రైవ్

“ప్రమాదం ఎప్పుడు, ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. అందుకే ప్రతి ప్రయాణం అప్రమత్తతతో సాగాలి. నిర్లక్ష్య డ్రైవింగ్, రాంగ్‌రూట్ ప్రయాణం, ట్రాఫిక్ సిగ్నల్స్ ఉల్లంఘన వంటి చర్యలు ప్రాణాంతక ప్రమాదాలకు దారితీస్తాయి” అని ఆయన హెచ్చరించారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు నగరవ్యాప్తంగా మోటారు వాహనాల చట్టాన్ని కఠినంగా అమలు చేస్తున్నామని, ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ తదితర పత్రాలు వెంట ఉంచుకోవాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పటికీ కొంతమంది వాహనదారులు ఇంకా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని సీఐ ఆవేదన వ్యక్తం చేశారు. ఇకపై ఎలాంటి ఉపేక్ష ఉండదని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తేనే ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని, సురక్షిత ప్రయాణమే నిజమైన విజయమని ట్రాఫిక్ సీఐ మహమ్మద్ ఆసిఫ్ పేర్కొన్నారు. ప్రజల సహకారంతో ప్రమాద రహిత సమాజ నిర్మాణమే పోలీసుల లక్ష్యమని ఆయన తెలిపారు.

Next Story