108 సేవల్లో మరో మైలురాయిని అధిగమించిన ఏపీ సర్కార్

by Naga Rani Yarlagadda |

ఏపీ సర్కార్ 108 అంబులెన్స్ సేవలు అందించడంలో మరో మైలురాయిని చేరుకుంది.

108 సేవల్లో మరో మైలురాయిని అధిగమించిన ఏపీ సర్కార్
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సర్కార్ 108 అంబులెన్స్ సేవలు అందించడంలో మరో మైలురాయిని చేరుకుంది. ఒక్క ఏడాది కాలంలో 7.78 లక్షల ఎమర్జెన్సీ కేసులకు సూపర్ ఫాస్ట్ సేవలందించింది. 2025 జూన్ నుంచి.. 2026 జూన్ వరకూ 7 లక్షల 78 వేల, 799 అత్యవసర కేసుల్లో ఉత్తమ సేవలందించి.. లక్షలాది ప్రజల ప్రాణాలను కాపాడింది. రాష్ట్రంలోని పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో 24 గంటలూ అందుబాటులో ఉన్న 108 అంబులెన్స్ సేవలు ప్రమాదాలు, గుండెపోటు, ప్రసవాలు, ఇతర అత్యవసర ఆరోగ్య సమస్యల సమయంలో వేగంగా స్పందించి బాధితులను ఆస్పత్రులకు తరలించాయి.

రోడ్డు ప్రమాద బాధితులకు, గర్భిణులకు అండగా..

గత ఏడాది కాలంలో 1,13,764 మంది రోడ్డు ప్రమాద బాధితులకు 108 అంబులెన్స్ సేవలు అందించాయి. ప్రమాదం జరిగిన ప్రాంతాలకు వేగంగా చేరుకుని ప్రాథమిక చికిత్స అందించి సమీప ఆస్పత్రులకు తరలించడం ద్వారా అనేక ప్రాణాలను కాపాడగలిగాయి. మాతా-శిశు ఆరోగ్య సంరక్షణలో కూడా 108 సేవలు కీలక పాత్ర పోషించాయి. మొత్తం 1,05,786 మంది గర్భిణులు ఈ సేవలను వినియోగించుకున్నారు. ప్రసవ నొప్పులు వచ్చిన సమయంలో సురక్షితంగా ఆస్పత్రులకు చేరవేయడం ద్వారా తల్లీబిడ్డల ప్రాణాలను రక్షించడంలో ఈ సేవలు ఎంతో ఉపయోగపడ్డాయి.

గుండెజబ్బుల కేసుల్లో వేగవంతమైన స్పందన

గుండెపోటు, ఇతర గుండె సంబంధిత అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకం. ఈ నేపథ్యంలో 45,951 గుండెజబ్బుల కేసులకు 108 అంబులెన్స్ సిబ్బంది సత్వర వైద్యసాయం అందించి రోగులను సమయానికి వైద్య సంస్థలకు తరలించారు. దూర ప్రాంత గ్రామాలు, గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలు పరిమితంగా ఉన్న సందర్భాల్లో 108 సేవలు ప్రజలకు ప్రాణాధారంగా నిలుస్తున్నాయి. ఒక్క ఫోన్ కాల్‌తో అత్యవసర సేవలు అందుబాటులోకి రావడం వల్ల పేద, మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా ఈ సేవలను వినియోగిస్తున్నారు. ఈ గణాంకాలు 108 అంబులెన్స్ సేవలు రాష్ట్ర ప్రజల ఆరోగ్య భద్రతలో ఎంత కీలక పాత్ర పోషిస్తున్నాయో స్పష్టం చేస్తున్నాయి.

Next Story