జైల్లో పూర్తిగా క్షీణించిన మాజీ ప్రధాని ఆరోగ్యం.. వైరల్ అవుతున్న ఫోటో

by Muthe.Rajitha |

తీవ్ర అనారోగ్యంతో కనిపిస్తున్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది.

జైల్లో పూర్తిగా క్షీణించిన మాజీ ప్రధాని ఆరోగ్యం.. వైరల్ అవుతున్న ఫోటో
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రస్తుతం జైల్లో ఉన్న పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోగ్యం పూర్తిగా క్షీణించినట్టు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫోటో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుండటంతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు, ఆయన పార్టీ PTI కార్యకర్తలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం ఇమ్రాన్ ఖాన్ రావల్పిండిలో నిర్బంధంలో ఉన్నారు. 2022లో PTI ప్రభుత్వం కుప్ప కూలిన తర్వాత పలు కేసుల్లో అరెస్టు చేయబడి జైలు జీవితం గడుపుతున్నారు. దాదాపు 922 రోజులుగా సాలిటరీ కాన్ఫైన్‌మెంట్‌(ఒంటరిగా ఒకే గదిలో నిర్బంధం)లో ఉన్నారు. బయటి ప్రపంచంతో పూర్తిగా కాంటాక్ట్స్ తెగిపోయాయి.

కాగా ఇటీవల ఫిబ్రవరి 12న సుప్రీమ్ కోర్టు ఆదేశాల మేరకు ఆయన తన న్యాయవాది ఇమ్రాన్ ను జైల్లో కలుసుకున్నారు. ఈ భేటీలో జైలు గదిలో ఇద్దరూ మాట్లాడుతున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అంతర్జాతీయ మీడియాకెక్కింది. ఆ ఫోటోలో ఇమ్రాన్ ఖాన్ పూర్తిగా బలహీనంగా, తీవ్ర అనారోగ్యంతో, ఒక కన్ను వాచిపోయి కనిపించారు. న్యాయవాది కోర్టుకు సమర్పించిన నివేదిక ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్ కుడి కంటి చూపు తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలిపారు. రెటీనాలో రక్తం గడ్డకట్టడంతో కుడి కన్నులో దాదాపు 85 శాతం చూపు కోల్పోయారని, మిగిలింది కేవలం 15 శాతం మాత్రమేనని పేర్కొన్నారు. మూడు నుంచి నాలుగు నెలలుగా సమస్య ఉన్నప్పటికీ జైలు అధికారులు సరైన వైద్య సేవలు అందించలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రత్యేక కంటి వైద్యుడిని అందించకుండా కేవలం ఐ డ్రాప్స్ మాత్రమే ఇచ్చారని, ఆలస్యంగా చికిత్స ప్రారంభించడంతో కంటిచూపు పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందని నివేదికలో పేర్కొనబడింది. ఇమ్రాన్ ఖాన్ స్వయంగా "నా కుడి కన్ను చూపు పూర్తిగా పోతోంది, దయచేసి నిపుణుడిని పంపించండి" అని తన లాయర్‌ ద్వారా కోర్టుకు విన్నవించుకున్నారని సమాచారం.

రాజకీయ ప్రతీకార చర్య!

జైలులో బలహీనంగా కనిపిస్తున్న ఇమ్రాన్ ఫోటో నెట్లో వైరల్ కావడంతో ఇమ్రాన్ కుటుంబ సభ్యులు తీవ్రంగా స్పందించారు. ఇమ్రాన్ ఆరోగ్యంపై మెడికల్ నెగ్లిజెన్సీతో వ్యవహరిస్తున్నారని, కావాలనే సరైన వైద్యం అందించడం లేదని, దీనికి పాక్ ఆర్మీ చీఫ్ అసిఫ్ మునీర్ బాధ్యత వహించాలని మండిపడుతున్నారు. మరోవైపు PTI నాయకులు, ఆ పార్టీ అనుచరులు దీనిని రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటూ ఇమ్రాన్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

సుప్రీంకోర్టు జోక్యం

ఈ క్రమంలో పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇమ్రాన్ ఆరోగ్యంపై జోక్యం చేసుకుని వైద్య నిపుణులతో కూడిన మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించింది. ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్య పరిస్థితిపై సమగ్ర నివేదిక సమర్పించాలని, అలాగే ఆయన తన కుటుంబ సభ్యులతో మాట్లాడేందుకు అనుమతి కల్పించాలని కూడా సూచించింది. కాగా ఇటీవల ఇమ్రాన్ ఖాన్ జైలులోనే చనిపోయారనే వార్తలు రావడంతో పాకిస్తాన్ లో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగిన సంగతి తెలిసిందే. అపుడు పాక్ ప్రభుత్వం స్వయంగా జోక్యం చేసుకొని, ఇమ్రాన్ బతికే ఉన్నారని క్లారిటీ ఇవ్వడమే కాకుండా, ఆయన కుటుంబ సభ్యులు జైల్లో కలుసుకునే ఏర్పాటు చేసింది.

Next Story