ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

by Malleboina Mahesh |

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో భాగంగా భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి నేడు సిట్ (SIT) విచారణకు హాజరుకానున్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణ కు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసు దర్యాప్తును వేగవంతం చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) అధికారులు.. నేడు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డిని విచారించనున్నారు. ఈ కేసుకు సంబంధించిన బాధితుడిగా ఆయన వాంగ్మూలాన్ని (స్టేట్‌మెంట్) సిట్ అధికారులు రికార్డ్ చేయనున్నారు. ఇందుకోసం శనివారం ఉదయం 11 గంటలకు బంజారాహిల్స్‌లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు రావాల్సిందిగా పోలీసులు ఆయనకు అధికారికంగా సమాచారం అందించారు.

అసెంబ్లీ ఎన్నికల సమయంలో ట్యాపింగ్

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వ్యూహరచనలో, ఆ పార్టీ అధికారంలోకి రావడంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి అత్యంత కీలక పాత్ర పోషించారు. సరిగ్గా అదే సమయంలో, అప్పటి ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ ముఖ్య నేతల కదలికలు, వారి ఎన్నికల వ్యూహాలను పసిగట్టేందుకు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఫోన్లను అక్రమంగా ట్యాప్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టిన సిట్ అధికారులు సాంకేతిక ఆధారాలను సేకరించారు. పలువురు కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోన్ కూడా ట్యాప్ అయినట్లు అధికారులు సాంకేతికంగా నిర్ధారించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బాధితుడిగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి ఇచ్చే వాంగ్మూలం ఈ కేసులో మరింత కీలకం కానుంది.

Next Story