Caracal: దశాబ్దాల తర్వాత కెమెరాకు చిక్కిన అరుదైన అడవి పిల్లి

by Ramesh Naini |   (  Updated:2026-06-06 03:47:03  IST  )

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కునో జాతీయ ఉద్యానవనంలో ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది.

Caracal: దశాబ్దాల తర్వాత కెమెరాకు చిక్కిన అరుదైన అడవి పిల్లి
X

దిశ, డైనమిక్ బ్యూరో: మధ్యప్రదేశ్‌లోని షియోపూర్ జిల్లాలో ఉన్న ప్రసిద్ధ కునో జాతీయ ఉద్యానవనంలో (Kuno National Park) ఓ అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. దశాబ్దాల సుదీర్ఘ విరామం తర్వాత ‘కారకల్’ (Caracal) అనే అత్యంత అరుదైన జాతికి చెందిన అడవి పిల్లి తాజాగా కెమెరా కంటికి చిక్కింది. అటవీశాఖ అధికారులు చేపట్టిన కెమెరా ట్రాప్ సర్వేలో ఈ అరుదైన వన్యప్రాణి సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. చాలా కాలం తర్వాత ఈ అడవి పిల్లి మళ్లీ కనిపించడం రాష్ట్ర వన్యప్రాణి సంరక్షణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిగా అటవీ అధికారులు, పర్యావరణవేత్తలు భావిస్తున్నారు.

జీవవైవిధ్యానికి సానుకూల సంకేతం

సహజంగా చాలా అప్రమత్తంగా ఉంటూ, మనుషుల కంట పడకుండా (elusive) సంచరించే ఈ కారకల్ పిల్లులు క్రమంగా కనుమరుగవుతున్న వన్యప్రాణుల జాబితాలో ఉన్నాయి. తాజాగా కునో అడవుల్లో దీని జాడ దొరకడం ఆ ప్రాంతంలోని సుసంపన్నమైన జీవవైవిధ్యానికి, పర్యావరణ సమతుల్యతకు ఒక గొప్ప సానుకూల సంకేతంగా నిపుణులు అభివర్ణిస్తున్నారు.

హర్షం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి

ఈ పరిణామంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ (Dr. Mohan Yadav) హర్షం వ్యక్తం చేశారు. ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ వన్యప్రాణి సంరక్షణ పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధిని పునరుద్ఘాటించారు. ‘ప్రాజెక్ట్ చీతా (Project Cheetah) ఉద్దేశం కేవలం చీతాలకు పునరావాసం కల్పించడం మాత్రమే కాదు... అడవిలోని వన్యప్రాణులన్నింటినీ, వాటి సహజ ఆవాసాలను సంరక్షించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం’ అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. మొత్తానికి, చీతాల రాకతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన కునో జాతీయ పార్కు, ఇప్పుడు ఈ అరుదైన ‘కారకల్’ రాకతో వన్యప్రాణి ప్రేమికులకు మరో ఆనందాన్ని మిగిల్చింది.

Next Story