- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇచ్చిన హామీలు నీటిమూటలేనా...!
లెక్కలేనన్నీ హామీలిచ్చి.. నెలలు కావొస్తున్న ఇప్పటి వరకు అభివృద్ధి మాట కానరావడం లేదంటూ కార్పోరేటర్లపై డివిజర్ ప్రజలు ఫైర్ అవుతున్నారు.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: నన్ను కార్పోరేటర్ గెలిపిస్తే దశాబ్దాల నాటి సమస్యను పరిష్కరిస్తా.. అధికారంలో ఉన్నది మన పార్టీనే ఖచ్చితంగా మంత్రిని కలిసి పనిచేయిస్తా.. గతంలో పనిచేసిన నాయకుడు సొంతపనులే చేసుకున్నడు... పదవిని అడ్డుపెట్టుకొని వ్యాపారాలు చేసుకున్నడు.. కాంట్రాక్టులు చేసుకున్నడు... ఆస్తులు కూడబెట్టుకున్నడు.. వార్డును పట్టించుకోలేదు.. నేను మాత్రం అవినీతికి పాల్పడను...అభివృద్ధి కోసం పాటుపడుతా... మున్సిపల్ కార్పోరేషన్ లో అధికారపార్టీ తరుపున పోటీచేసిన అభ్యర్థి మాటలివి.... నన్ను గెలిపిస్తే అధికారపార్టీని నిలదీస్తా... నిధుల వరద పారిస్తా... ప్రతీ మట్టి రోడ్డును సీసీ రోడ్డు చేస్తా... డ్రైనేజీలు వేయిస్తా... ఇది ప్రతిపక్షపార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థుల వాగ్ధానాలు... స్థానిక ఎమ్మెల్యే మా పార్టీ... పోరాడుతాం... ఉద్యమాలు చేస్తాం... డివిజన్ ను ఎవరూ చేయనంతగా అభివృద్ధి చేస్తా.. కమ్యూనిస్టు పార్టీ తరుపున పోటీ చేసిన అభ్యర్థి హామీ. ఇలా ఎవరికి వారు కొత్తగూడెం మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో పోటీ చేసిన నాయకులు.... పోటాపోటీగా ఇచ్చిన హామీలు, వాగ్ధానాలు... గ్యారంటీలు... కార్పోరేటర్లుగా గెలిచిన నాయకులు ప్రమాణస్వీకారం చేసి నాలుగు నెలలు కావొస్తున్న ఇప్పటి వరకు అభివృద్ధి మాట కానరావడం లేదు. అసలు కొత్తగూడెం కార్పోరేషన్లో ఏం జరుగుతుందో నూతనంగా గెలిచిన కార్పోరేటర్లకు అర్ధం కానీ పరిస్థితి.
లచ్చలు పెట్టినం... పదివేలు వెనకేయలే...
మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో గెలిచేందుకు అడిగినోళ్ళకు అడిగినంత, ఓటర్ల గొంతెమ్మ కోర్కెలు తీర్చేందుకు వెనుకాడకుండా అప్పులు చేసి, తమ స్థాయికి మించి నగదు ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. లక్షలు పెట్టి గెలిచాక ఇప్పుడు నాలుగునెలలు దాటిన ఇప్పటి వరకు కొంతమంది కార్పోరేటర్లు డివిజన్ అభివృద్ధికి కొబ్బరికాయ కూడా కొట్టలేదంటే ఆశ్చర్యం వేయకమానదు. లక్షలు పోసి పదవి కొనుక్కున్నట్లుగా ఉందని తమ బంధువుల ముందు కొంతమంది కార్పోరేటర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు కనీసం పదివేలు కూడా వెనకేసుకోలేదని, పది రూపాయల పని కూడా చేయలేని పరిస్థితి నెలకొందని ఆవేదన చెందుతున్నారు. మరికొంతమంది అయితే ఎన్నికల్లో గెలిచాక కట్టిన బ్యానర్లు కూడా తీయకుండా ఈ డివిజన్ కార్పోరేటర్లం అని ప్రజలకు గుర్తు చేసుకుంటూ ఊరట పొందుతున్నారు. పైగా డివిజన్లో ప్రైవేట్ కార్యక్రమాలకు బ్యానర్లు, యువతకు ఇతరత్రా ఖర్చులు కూడా ప్రస్తుతం తమ జేబుల నుంచే పెట్టాల్సి వస్తుందంటూ డివిజన్ ప్రథమ పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో ఓడిన అభ్యర్ధి బహిరంగంగా ఏడిస్తే... గెలిచిన అభ్యర్ధులు ఇంట్లో ఏడుస్తున్నట్లుగా తయారైంది కార్పోరేటర్ల పరిస్థితి.
నాలుగు నెలల నుంచి పదిపైసల పనిచేయలే
కార్పోరేటర్లు గెలిచిన నాలుగు నెలలవుతున్నా కొన్ని డివిజన్లలో పది పైసల పనికూడా చేయలేదంటే అతిశయోక్తి కాదు. ఎన్నో హామీలు ఇచ్చిన. ప్రభుత్వవేమో నిధులు విడుదల చేయడం లేదు. ఇదేమో ప్రజలకు తెలియదు. ఎక్కడి నుంచి నిధులు తీసుకువచ్చి డివిజన్లో లో అభివృద్ది పనులు చేపట్టాలని తమ అనుచరుల వద్ద వాపోతున్నారు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన నిధులతోనే కొన్ని డివిజన్లలో చిన్న రోడ్లు, చిన్న చిన్న డ్రైనేజీలు వేస్తున్నామని కొంతమంది కార్పోరేటర్లు చెబుతున్నారు. ఇక కొత్తగా కార్పోరేటర్లు గెలిచినవారికి ప్రొటోకాల్ తప్ప ప్రభుత్వం నిధులు విదిల్చడం లేదని, దీంతో ఎన్నికల్లో ఏమోమో హామీలు ఇచ్చినం, ఇప్పుడేమో ఏం చేయాలో అర్ధం కాక ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్నామని, ముందు.. ముందు.. చేద్దాం.. చేద్దాం... చేయాల్సింది చాలా ఉంది అంటూ ప్రజలను మభ్యపెట్టడమే సరిపోతుందని చెబుతున్నారు.
నూతన కార్పోరేటర్ల వింత పరిస్థితి
ఈ ఎన్నికల్లో గెలిచిన కార్పోరేటర్లలో నూతనంగా తొలిసారి ఎన్నికైన వారు దాదాపు 40మంది వరకు ఉన్నారు. వారిలో అనేకమంది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు ఉన్నారు. అధికార పార్టీలో ఉన్నవారు తమ అగ్రనాయకులకు డివిజన్ అభివృద్ధి కోసం జాబితాను ముందుపెడుతున్నారు. కానీ నిధుల విషయంలో తీవ్ర జాప్యమే జరుగుతుంది. నిధులు ఇవ్వండని గట్టిగా అడగలేని పరిస్థితి. ఏమైనా అడిగితే ఎటువైపు నుంచి ఉపద్రవం ముంచుకు వస్తుందోనని కొంత ఆందోళన చెందుతుండగా, మరోవైపు ప్రతిపక్ష కార్పోరేటర్లు ఎవర్నీ నిలదీయాలో అర్ధంకానీ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వంపైన విమర్శలు చేసి కొంత తమ ప్రభావం చూపుతున్నప్పటికీ నిధుల విషయంలో మాత్రం ఇరు పార్టీల నాయకులకు ఒక్క రూపాయి విడుదల చేయకపోవడం, అవాక్కవడం కార్పోరేటర్ల వంతవుతోంది. I
99రోజుల పనుల బిల్లులు కూడా పెండింగ్
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించిన 99రోజుల కార్యక్రమంలో భాగంగా 'ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక' లో డివిజన్లలో ఏప్రిల్ నెలలో చేసిన పారిశుద్ధ్య పనుల కోసం కార్పోరేటర్ సుమారు రూ.50వేల దాకా తమ జేబు నుంచే ఖర్చులను భరించారు. కార్పోరేషన్ అధికారులను నాలుగైదు సార్లు కలిసి విన్నవిస్తే కొత్తగూడెం పరిధిలోని కార్పోరేటర్లకు రూ.27వేల ను ఇచ్చి చేతులు దులుపుకున్నట్లు కార్పోరేటర్లు చెబుతున్నారు. ఇక మిగిలిన రూ.23వేలను కౌన్సిల్ ఎజెండాలో పెట్టి విడుదల చేస్తామని సెలవివ్వగా, ఇక పాల్వంచకు చెందిన కార్పోరేటర్లకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వారే బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్నారు.
కౌన్సిల్ సమావేశంలో సమస్యలులేవనెత్తుతం: మల్హోత్రా సాగర్ (కార్పొరేటర్)
కొత్తగూడెం కార్పోరేషన్ కార్యాలయంలో శనివారం కౌన్సిల్ సమావేశం నిర్వహించేందుకు కార్పోరేటర్లకు సమాచారం ఇచ్చారు. తమ సమస్యలను ఏకరువు పెట్టేందుకు, నిధుల విషయంలో నిలదీసేందుకు సిద్ధంగా ఉన్నాం. పారిశుద్ధ్య పనుల విషయంలో కార్పోరేషన్ చాలా అధ్వన్నంగా తయారైంది. ప్రతీ డివిజన్లో కార్మికుల సంఖ్యను పెంచాలని, కోతులు, కుక్కల బెడద ఉందని చెబుతున్నప్పటికీ కార్పోరేషన్ అధికారులు పట్టించుకోకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ఇక మిషన్ భగీరథ పనుల వల్ల గతంలో కోట్ల రూపాయల నిధులతో నిర్మించిన రోడ్లు ధ్వంసమయ్యాయి. ప్రజా ధనం దుర్వినియోగం అవుతూనే ఉంది. మంచినీటి సమస్య కూడా తీవ్రంగా ఉంది. రానున్న వర్షాకాలం సీజన్లో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున డివిజన్ ప్రజల సమస్యలపై ఈ కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తుతాం.






