- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిజిటల్ సర్వీస్ బుక్‌తో ప్రభుత్వం మాస్టర్ ప్లాన్.. ఇక వారి దొంగ సెలవులు చెక్
ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ రికార్డుల్లో అక్రమాలకు చెక్ పెట్టేందుకు రెండు మూడు నెలల్లో 'డిజిటల్ సర్వీస్ బుక్' అమలు. ప్రతి ఉద్యోగికి ప్రత్యేక యూజర్ ఐడీ.

దిశ, తెలంగాణ బ్యూరో: ఇంత కాలం ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ బుక్స్ నిర్వహణ లో జరుగుతున్న అక్రమాలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. అందుకోసం డిజిటల్ సర్వీస్ బుక్ ను అమల్లోకి తెచ్చేందుకు కసరత్తును స్పీడప్ చేసింది. దీంతో ఎన్ని రోజులు సెలవులు తీసుకున్నారు ? ఎన్ని ఎర్నిండ్ లీవ్స్ ఉపయోగించుకున్నారు ? చైల్డ్ కేర్ లీవ్స్ ఉపయోగించుకున్నారా ? లేదా ? ప్రభుత్వం నుంచి తీసుకున్న కారు లోన్ వాయిదాలను చెల్లిస్తున్నారా ? లేదా? అనే అంశాలపై పారదర్శకత వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటి నుంచి ఉద్యోగుల స్వల్పకాలిక, దీర్ఘకాలిక సెలవులు అన్ని ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకునే వెసులుబాటును ప్రభుత్వం కల్పిస్తుంది.
ట్రెజరీ ఆఫీసర్ల దందాకు చెక్
ప్రస్తుతం ఉద్యోగుల సర్వీస్ బుక్స్ ఫిజికల్ గా నిర్వహిస్తున్నారు. ప్రతి ఉద్యోగి ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్ అయ్యే వరకు అతని సెలవులు, ఇంక్రిమెంట్స్, స్పెషల్ ఇంక్రిమెంట్స్, ఎర్నిండ్ లీవ్స్, సర్వీసులోని ఇతర అంశాలు సంబంధిత బుక్స్ లో ఎంటర్ చేస్తున్నారు. ఈ బాధ్యతలను సంబంధిత శాఖ విభాగాధికారి, డ్రాయింగ్ ఆఫీసర్( ట్రెజరీ ఆఫీసరు) పర్యవేక్షణలో కొనసాగుతున్నాయి. దీంతో ఆ ఇద్దరు కుమ్మక్కై ఉద్యోగి నుంచి మామూళ్లు తీసుకుని, అతనికి అనుకూలంగా సర్వీస్ బుక్ ను రాస్తున్నట్టు ఫిర్యాదులు ఉన్నాయి. ఉదాహరణకు A అనే జూనియర్ లెక్చరర్ 2023–24 సంవత్సరంలో 20 రోజుల ఎర్నిండ్ లీవ్స్ ఉపయోగించుకున్నారు.
ఆ విషయాన్ని కాలేజీ ప్రిన్సిపాల్ జూనియర్ లెక్చరర్ సర్వీస్ బుక్‌లో ఎంటర్ చేయాలి. దాన్ని ట్రెజర్ ఆఫీసర్ కు సమాచారం ఇవ్వాలి. కానీ జూనియర్ లెక్చరర్ ఇచ్చే మామూళ్లు తీసుకుని ప్రిన్సిపాల్, ట్రెజరీ ఆఫీసరు కుమ్మక్కై సర్వీస్ బుక్స్ లో ఎంటర్ చేయడం లేదు. ఇలా ఒక్కో నెల ట్రెజరీ ఆఫీసరు లక్షల్లో వసూళ్లు చేస్తున్నట్టు ఫిర్యాదులు ప్రభుత్వానికి అందినట్టు తెలిసింది. అన్ని శాఖల్లో ఇదే తరహాలో దందాలు జరుగుతున్నట్టు గుర్తించిన ప్రభుత్వం ఆన్ లైన్ సర్వీస్ బుక్ ను అమల్లోకి తెచ్చేందుకు సిద్ధమైంది.
అడిగినంత ముట్టచెప్తోన్న ఉద్యోగులు
సర్వీస్ బుక్స్ ను తమకు అనుకూలంగా రాసేందుకు తమ బాస్ లు, ట్రెజరీ ఆఫీసర్లు ఇంట్రెస్ట్ చూపుతుండటంతో ఉద్యోగులు పెద్ద ఎత్తున డబ్బులు ముట్టచెప్తున్నారు. దీంతో ఉపయోగించుకున్న ఎర్నిండ్ లీవ్స్ ఉపయోగించుకోలేదని సర్వీస్ బుక్ లో ఎంటర్ చేయడంతో రిటైర్డ్ సమయంలో ఆ సెలవులను సొమ్ము చేసుకుని వెసులుబాటు ఉంటుంది. కొన్ని జిల్లాల్లో ట్రెజరీ ఆఫీసర్ల సహకారంతో ఒక ఉద్యోగి రెండు మూడు సార్లు చైల్డ్ కేర్ లీవ్స్ ఉపయోగించుకుంటున్నట్టు ప్రభుత్వం గుర్తించినట్లు తెలిసింది. అలాగే కొన్ని జిల్లాల్లో ఉద్యోగులు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు పెట్టిన దీర్ఘ కాలిక సెలవులను సైతం సర్వీస్ బుక్స్ లో ఎంటర్ చేయలేదని ఫిర్యాదులు అందినట్లు సమాచారం. కొందరు సీనియర్ అధికారులు కార్లు కొనుక్కునేందుకు ప్రభుత్వం నుంచి తీసుకున్న వెహికల్ లోన్లను ట్రెజరీ ఆఫీసర్ల సహకారంతో తిరిగి చెల్లించకుండానే రిటైర్డ్ అయినట్టు ఆరోపణలు ఉన్నాయి.
త్వరలోనే ఆన్ లైన్ లోకి..
రెండు మూడు నెలల్లో ఆన్ లైన్ సర్వీసు బుక్ ను అమల్లోకి తెచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తున్నది. ఇప్పటి వరకు సుమారు 85 శాతం మంది ఉద్యోగులు తమ సర్వీస్ బుక్స్ ను ఆన్ లైన్ లో అప్లోడ్ చేసినట్లు తెలిసింది. వాటన్నింటినీ స్ర్కూటీనింగ్ చేసిన తరువాత ఒక్కో ఉద్యోగికి ప్రత్యేకంగా యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ను జారీ చేయనున్నారు. అందుకోసం ఆర్థిక శాఖ ప్రత్యేకంగా ఓ ఐటీ విభాగాన్ని ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ సర్వీస్ బుక్ అమల్లోకి వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగి సెలవుల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. సెలవుల మంజూరు కూడా ఆన్ లైన్ లోనే సంబంధిత విభాగానికి చెందిన అధికారి అనుమతించాల్సి ఉంటుంది. అలాగే అతనికి సంబంధించిన ప్రమోషన్లు, ఇంక్రిమెంట్స్‌తో పాటు ఇతర అంశాలు అన్ని కూడా ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉంటాయి.






