- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిల్డర్లకు నాలా క్లియరెన్స్
బిల్డర్లకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్(నాలా) క్లియరెన్స్ చిక్కులు తప్పడంలేదు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో మార్ట్ గేజ్ రిలీజ్ క్లిష్టతరంగా మారింది. దీనిపై బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బిల్డర్లకు నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ యాక్ట్(నాలా) క్లియరెన్స్ చిక్కులు తప్పడంలేదు. ఈ సమస్య పరిష్కారం కాకపోవడంతో మార్ట్ గేజ్ రిలీజ్ క్లిష్టతరంగా మారింది. దీనిపై బిల్డర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్(టీబీఎఫ్) అత్యవసర సమావేశం నిర్వహించింది. బిల్డర్లు ఎదుర్కొంటున్న సమస్యలు, సెంట్రింగ్ కార్మికుల సమ్మె వంటి అంశాలపై చర్చించి తీర్మానాలు చేసింది. ధరణి పోర్టల్ అమలులోకి వచ్చిన తరువాత.. గతంలో కొనుగోలు చేసిన కొన్ని భూములకు సంబంధించిన నాలా క్లియరెన్స్ వివరాలు రెవెన్యూ శాఖ వద్ద అందుబాటులో లేకపోవడం వల్ల బిల్డర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు బిల్డింగ్ పర్మిషన్లు మంజూరు చేసే సమయంలో.. అవసరమైన ఫీజులు చెల్లించి తరువాత నాలా క్లియరెన్స్ పొందాలని సూచించినప్పటికీ.. ప్రస్తుతం ఆ ప్రక్రియను పూర్తి చేయడానికి అవసరమైన పోర్టల్ సదుపాయం అందుబాటులో లేకపోవడం వల్ల క్లియరెన్స్ పొందడం సాధ్యం కావడం లేదు. ఫలితంగా భవనాలు పూర్తయి.. నిబంధనల ప్రకారం నిర్మాణం జరిగినప్పటికీ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు పొందడంలో జాప్యం ఏర్పడుతోంది. అలాగే నాలా క్లియరెన్స్ పెండింగ్‌లో ఉన్నందున 5 శాతం మార్ట్ గేజ్ విడుదల కాకపోవడంతో బిల్డర్లు ఆ భాగాన్ని విక్రయించలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందువల్ల ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకొని.. అవసరమైతే హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ ద్వారా సంబంధిత ఫీజులను వసూలు చేసి ఆయా శాఖలకు జమ చేసే విధానాన్ని అమలు చేయాలని కోరారు. దీని ద్వారా నాలా క్లియరెన్స్ ప్రక్రియను పూర్తి చేసి.. 5% మార్ట్ గేజ్ విడుదలకు అవకాశం కల్పించాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల సరఫరా…
విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు, ఏర్పాటు విషయంలో బిల్డర్లు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో బిల్డర్లు అధీకృత ఏజెన్సీలు, సరఫరాదారుల ద్వారా ట్రాన్స్‌ఫార్మర్లను కొనుగోలు చేసి ప్రాజెక్టుల్లో ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. అయితే ఇటీవల ప్రభుత్వం అమలు చేసిన విధానాల ప్రకారం.. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ పొందిన తరువాత మాత్రమే సంబంధిత విద్యుత్ శాఖ ద్వారా ట్రాన్స్‌ఫార్మర్లు పొందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధానం వల్ల బిల్డర్లు, ఫ్లాట్ కొనుగోలుదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని టీబీఎఫ్ అభిప్రాయపడింది. భవన నిర్మాణం పూర్తయి ఫ్లాట్లు కొనుగోలుదారులకు అప్పగించిన తరువాత కూడా ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో లేకపోవడం వల్ల వారు సాధారణ గృహ విద్యుత్ ఛార్జీలకు బదులుగా అధిక కమర్షియల్ టారిఫ్‌లను చెల్లించాల్సి వస్తోంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనంతరం దరఖాస్తు చేసినప్పటికీ.. విద్యుత్ శాఖ వద్ద స్టాక్ కొరత కారణంగా మూడు నెలల నుంచి తొమ్మిది నెలల వరకు ట్రాన్స్‌ఫార్మర్లు సరఫరా చేయలేకపోతున్నారు.
సమస్యలు పరిష్కరించాలి : టీబీఎఫ్
ట్రాన్స్ ఫార్మర్స్ సమస్యపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ బిల్డర్ల ఫెడరేషన్(టీబీఎఫ్) కోరుతోంది. ఈ సమస్యను అత్యవసరంగా పరిశీలించి.. గతంలో అమలులో ఉన్న విధానాన్ని కొనసాగించడం లేదా భవనం పూర్తికాక ముందే ట్రాన్స్‌ఫార్మర్ల కొనుగోలు, ఏర్పాటుకు అనుమతి కల్పించడం ద్వారా బిల్డర్లు, ఫ్లాట్ కొనుగోలుదారులకు ఉపశమనం కలిగించాలని కోరింది. దీంతోపాటు నాలా ఛార్జీల విషయంలోనూ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకోవాలని ఫెడరేషన్ ప్రతినిధులు కోరుతున్నారు. నాలా పర్మిషన్ కారణంగా మార్ట్ గేజ్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని.. దీనికి సంబంధించి జీహెచ్ఎంసీ, సీఎంసీ, ఎంఎంసీ, హెచ్ఎండీఏలకు స్పష్టమైన ఆదేశాలు జారీచేయాలని ప్రభుత్వాన్ని కోరుతోంది.






