చిమిర్యాల హైస్కూల్‌లో అగ్నిప్రమాదం.. పుస్తకాలు, ఫర్నిచర్ దగ్ధం

by Kodari Anjali |

చిమిర్యాల గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది.

చిమిర్యాల హైస్కూల్‌లో అగ్నిప్రమాదం.. పుస్తకాలు, ఫర్నిచర్ దగ్ధం
X

దిశ, కోదాడ: చిమిర్యాల గ్రామంలోని ప్రభుత్వ హైస్కూల్‌లో శనివారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్‌సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పాఠశాల ఆవరణలో కలకలం రేగింది. ప్రమాద సమయంలో పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత కారణంగా పాఠశాలలో నిల్వ ఉంచిన పాఠ్యపుస్తకాలు, రికార్డులు, బెంచీలు, కుర్చీలు, ఇతర ఫర్నిచర్ సామగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతైనట్లు తెలుస్తోంది.

ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌నే కారణం..?

అగ్నిప్రమాదం జరిగిన వెంటనే గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాఠశాల వద్దకు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. మంటలు ఇతర తరగతి గదులకు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది అప్రమత్తంగా చర్యలు చేపట్టారు. ఘటనలో ఆస్తి నష్టం భారీగా జరిగినట్లు ప్రాథమిక అంచనాలు సూచిస్తున్నాయి. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూట్‌నే కారణమని అధికారులు ప్రాథమికంగా భావిస్తున్నప్పటికీ, పూర్తి స్థాయి విచారణ అనంతరం ఖచ్చితమైన కారణాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఘటనపై విద్యాశాఖ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

Next Story