ఇది నా కెరీర్‌లో లభించిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను.. రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ పోస్ట్

by Mallepaka Hamsa |

సింగీతం శ్రీనివాసరావు వంటి ఒక గొప్ప మహానుభావుడి దర్శకత్వంలో పనిచేసే అరుదైన అవకాశం రావడం నా కెరీర్‌లో లభించిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను.

ఇది నా కెరీర్‌లో లభించిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను.. రాహుల్ రవీంద్రన్ ఎమోషనల్ పోస్ట్
X

దిశ, సినిమా: టాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు ఒకప్పుడు ఎన్నో క్లాసిక్, సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను మైమరపించారు. ఇప్పుడు ఆయన 94 ఏళ్ల వయసులో మళ్లీ మెగాఫోన్ పట్టి, ‘సింగ్ గీతం’ అనే వైవిధ్యమైన టైటిల్‌తో ఒక మ్యూజికల్ ఫాంటసీ సినిమాను తెరకెక్కించారు. ఇందులో అయాన్, అహల్య బమ్రూ, షాలిని కొండేపూడి ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అలాగే రేవతి, అమృతం ఫేంబ నారిపెద్ది శివన్నారాయణ, బెనర్జీ, అగు స్టాన్లీ కూడా భాగం అయ్యారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ప్రముఖ డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. షూటింగ్ పూర్తి చేసుకుని జూన్ 11న సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో తాను కూడా భాగం కావడంపై నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ సోషల్ మీడియా వేదికగా ఎమోషనల్ అయ్యారు. "జూన్ 11 నుండి 'సింగ్ గీతం' థియేటర్లలోకి వస్తోంది. సింగీతం శ్రీనివాసరావు వంటి ఒక గొప్ప మహానుభావుడి దర్శకత్వంలో పనిచేసే అరుదైన అవకాశం రావడం నా కెరీర్‌లో లభించిన అత్యున్నత గౌరవంగా భావిస్తున్నాను.

జీవితాంతం గుర్తుండిపోయే ఈ అనుభవాన్ని నాకు అందించిన స్వప్న, ప్రియాంక, నాగ్ అశ్విన్‌లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. పైగా ఈ సినిమాలో నటించినందుకు నాకు పారితోషికం కూడా ఇచ్చారు" అంటూ సరదాగా పేర్కొన్నారు. సింగీతం గారిపై తనకున్న గౌరవాన్ని చాటుకుంటూ.. "ఆయన 94 ఏళ్ల వయసులో ఈ సినిమా చేశారు. సింగీతం సార్ తన 34 ఏళ్ల వయసులో చేసిన సినిమాలు, ప్రయోగాలు, తీసుకున్న రిస్కులను నేటి తరం దర్శకులెవరూ రీ-క్రియేట్ చేయలేకపోతున్నాం. ఈ వయసులో కూడా ఆయన సమాజానికి ఒక కథను చెప్పాలనుకోవడం గొప్ప విషయం. ఇందులో నేను ఒక చిన్న కామియో చేశాను. నాగి నాకు ఈ రోల్ గురించి చెప్పినప్పుడు, కథ కూడా వినకుండా ఏ డేట్స్ కావాలో చెప్పండి అని అన్నాను. సినిమా మొదటి రెండు రోజుల షూటింగ్ నాతోనే జరిగింది. ఆ రెండు రోజులు సింగీతం సార్‌తో గడపడం, ఆయన కెరీర్ విశేషాలు తెలుసుకోవడం నా అదృష్టం. నెగిటివిటీ లేదా ట్రోలింగ్స్ పక్కన పెట్టి, ఆయన చేసిన ఈ గొప్ప ప్రయత్నాన్ని, రిస్కులను థియేటర్లలో చూసి ఆదరించండి" అని రాహుల్ రవీంద్రన్ ప్రేక్షకులను కోరారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.

Next Story