- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వెల్‌నెస్ ఇండ్లు... పచ్చదనానికే ప్రాధాన్యత
రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఇల్లు అంటే కేవలం పెద్ద పెద్ద గదులు, విలాసవంతమైన ఇంటీరియర్ మాత్రమే అని భావించిన గృహ వినియోగదారులు ఇప్పుడు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు

దిశ, రంగారెడ్డి బ్యూరో : రియల్ ఎస్టేట్ రంగంలో ఇప్పుడు సరికొత్త ట్రెండ్ నడుస్తోంది. గతంలో ఇల్లు అంటే కేవలం పెద్ద పెద్ద గదులు, విలాసవంతమైన ఇంటీరియర్ మాత్రమే అని భావించిన గృహ వినియోగదారులు ఇప్పుడు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నారు. విలాసం కంటే ఆరోగ్యం, ప్రశాంతతకే పెద్ద పీట వేస్తున్నారు. ఇంటి స్థలంలో ఆహ్లాదకరమైన పచ్చదనానికే సింహభాగం స్థలాన్ని కేటాయిస్తున్నారు. ఈ ధోరణి లగ్జరీ ఇండ్లకే కాదు.. మధ్యతరగతి గృహ నిర్మాణాలకూ పాకింది. ఐటీ కారిడార్ ప్రాంతాలతోపాటు మహా నగరం చుట్టు పక్కల అన్ని ప్రాంతాల్లోనూ వెల్ నెస్ ఇండ్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది. రియల్ ఎస్టేట్ డెవలపర్స్ సైతం ఈ మార్పుకు అనుగుణంగా తమ ప్రాజెక్టుల్లో వెల్ నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చి నిర్మాణాలను చేపడుతున్నారు.
ఆరోగ్యానికి ప్రాధాన్యం
పెద్దలు మొదలుకుని యువతరం వరకు అందరూ ఇల్లు కొనేటప్పుడు చుట్టు పక్కల ఆరోగ్య సౌకర్యాలు ఎలా ఉన్నాయన్నది చూస్తున్నారు. ఇల్లు విశాలంగా ఉండటమే కాకుండా పిల్లల కోసం క్రీడా సదుపాయాలు, పెద్దలకు క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్ వంటి సదుపాయాలు ఉండాలని భావిస్తున్నారు. ఖాళీ స్థలాన్ని ఎక్కువగా వదిలి పచ్చదనం అధికంగా ఉండేలా వివిధ రకాల మొక్కలను పెంచుతున్నారు. గాలి, వెలుతురు ధారాళంగా వచ్చేలా కిటికీలు, తలుపులూ ఏర్పాటు చేసుకుంటున్నారు. ఆహ్లాదకరమైన అనుభూతిని పంచేలా.. ఇంటి గోడలతో పాటు ఇంట్లోని వస్తువులకు ఆకుపచ్చ, గులాబీ, లేత నీలం వంటి రంగులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బాల్కనీలు, వరండాల్లో సైతం కుండీల్లో మొక్కలను పెంచుతూ ఎక్కువ సమయం గడిపే ప్రయత్నం చేస్తున్నారు. సహజ వనరులకు సాంకేతికతను జోడించి నిర్మిస్తున్న ఈ ఇండ్లు మనిషి ఆయుష్షును పెంచుతాయని భావిస్తున్నారు. మానసిక, శారీరక ఆరోగ్యకరమైన వాతావరణాన్ని వెల్ నెస్ హోమ్స్ పుష్కలంగా అందిస్తాయన్న ఆలోచనతో చాలామంది ఉన్నారు.
భవిష్యత్తులో రీ సేల్ వాల్యూ
గృహ నిర్మాణ ప్రాజెక్టుల్లో నిర్మాణాలను ఒక్కో టైంలో ఒక్కో థీమ్‌తో చేపట్టడం సర్వ సాధారణం. గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు, కిడ్స్ ఫ్రెండ్లీ ప్రాజెక్టులు, రిటైర్మెంట్ హోమ్ ప్రాజెక్ట్.. ఇలా ఒక్కో థీమ్ ఒక్కో సమయంలో ట్రెండ్ అవుతోంది. మారుతున్న కొనుగోలుదారుల అభిరుచులకు అనుగుణంగా ప్రస్తుతం బిల్డర్లు వెల్ నెస్ ఇండ్లకు సంబంధించిన ప్రాజెక్టులకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. హైరైజ్డ్ అపార్ట్‌మెంట్స్ నుంచి లగ్జరీ హౌస్‌ల వరకు ఉన్న ఈ ట్రెండ్ మధ్య తరగతి గృహ నిర్మాణాల్లోకి సైతం చొచ్చుకుని వస్తోంది. జూబ్లీ హిల్స్, గచ్చి బౌలి ప్రాంతాలలో ఈ తరహా ప్రాజెక్టులను భారీగా చేపడుతుండగా.. ఇది నగరం చుట్టు పక్కల ఉన్న అన్ని ప్రాంతాలకూ పాకింది. సాధారణ ఇండ్ల కంటే వెల్ నెస్ ఫీచర్లు ఉన్న ఇండ్లు 20 నుంచి 30 శాతం వరకు అదనపు ధర పలుకుతున్నాయి. నిర్మాణ వ్యయం పెరిగినప్పటికీ దీర్ఘకాలిక ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని గృహ వినియోగదారులు ఈ అదనపు భారాన్ని భరించేందుకు వెనుకాడడం లేదు. వెల్ నెస్ నయా ట్రెండ్ రియల్ ఎస్టేట్ ముఖ చిత్రాన్నే మార్చేస్తోంది. భవిష్యత్తులో ఇటువంటి ఇండ్లకు రీసేల్ వాల్యూ కూడా భారీగా ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.






