పట్టణంలో ఎక్కడ మురుగునీరు నిలువ ఉండొద్దు: కలెక్టర్

by Kodari Anjali |

రైతుల సమస్యల పరిష్కారం కోసం జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందని కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అన్నారు.

పట్టణంలో ఎక్కడ మురుగునీరు నిలువ ఉండొద్దు: కలెక్టర్
X

దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ ను శనివారం కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ కలెక్టర్ పరిశీలించారు. మార్కెట్లో గల ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షించాలనీ, కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అందుబాటులో ఉండాలనీ రైతుల సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉందనీ జిల్లా కలెక్టర్ తెలిపారు. మార్కెట్ యార్డులో మెప్మా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి కొనుగోలు కేంద్రాన్నిక్షేత్రస్థాయిలో పర్యటించి, పరిశీలించి, రైతులతో నేరుగా మాట్లాడి కొనుగోలు ప్రక్రియపై వారి అభిప్రాయాలను కలెక్టర్ ఆరా తీశారు. రైతులు తమ పంటను సులభంగా విక్రయించుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు.

కొనుగోలు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో...

వరి తూకం, నాణ్యత పరీక్షలు, రికార్డుల నిర్వహణ, చెల్లింపుల ప్రక్రియను పరిశీలించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఏమైనా ధాన్యం తడిచిందా? ఇంకా ఎంత ధాన్యం కాంటా వేయాలి? కల్లాల్లో ఇంకా ఎంత ధాన్యం ఉంది? అని అధికారులను అడిగి తెలుసుకు న్నారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు సంబంధిత అధికారులు కొనుగోలు కేంద్రాల వద్ద క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని సూచించారు. ధాన్యం సేకరణను నిశితంగా పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. రైతులు కష్టించి పండించిన పంటలకు ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు అప్రమత్తంగా ఉండి రైతుకు నష్టం వాటిల్లకుండా జాగ్రత్త వహించాలని హెచ్చరించారు.

పట్టణంలో మురుగునీరు నిల్వ ఉండకుండా చూడాలి...

రానున్న వర్షాకాలంలో పట్టణంలో ఎక్కడా కూడా మురుగునీరు నిలవకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలోని వివిధ వార్డులలో జరుగుతున్న పనులను పరిశీలించారు. అదేవిధంగా అచ్చంపేట పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియాన్ని కలెక్టర్ పరిశీలించి, పార్కింగ్ తదితర అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్టేడియం వినియోగం, నిర్వహణ, అభివృద్ధి అవకాశాలపై అధికారుల నుంచి వివరాలు తెలుసుకున్నారు. ప్రజలకు, ముఖ్యంగా యువతకు క్రీడా సదుపాయాలు మరింత మెరుగ్గా అందేలా అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు ఉండాలి...

తదనంతరం పట్టణంలోని వంద పడకల ఆసుపత్రిని కలెక్టర్ తనిఖీ చేసి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ప్రజలతో ఆరా తీశారు. అలాగే వైద్య సిబ్బంది పనితీరుపై రికార్డులను పరిశీలించారు. కుక్క, పాముకాటుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయా ఉన్న మందులు కూడా తాళం చెల్లిని ఏమైనా ఉన్నాయా అని స్వయంగా కలెక్టర్ పరిశీలించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఎక్కడ నిర్లక్ష్యం చేయరాదని కావలసిన మందులు అందుబాటులో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ వెంట అచ్చంపేట ఆర్డిఓ యాదగిరి, అచ్చంపేట మున్సిపల్ కమిషనర్ మురళి, అచ్చంపేట తాహసిల్దార్ సైదులు సంబంధిత శాఖల అధికారులు, మున్సిపల్ అధికారులు, వైద్య సిబ్బంది, వ్యవసాయ శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

Next Story