ప్రమాదం అంచున విద్యుత్ స్తంభం.. పట్టించుకోని అధికారులు

by Kodari Anjali |

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలోని రైతు పెద్దోళ్ల ఎల్లం వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వంగి ఉంది.

ప్రమాదం అంచున విద్యుత్ స్తంభం..  పట్టించుకోని అధికారులు
X

దిశ, ఎల్లారెడ్డిపేట: రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం వెంకటాపూర్ గ్రామ పరిధిలోని రైతు పెద్దోళ్ల ఎల్లం వ్యవసాయ పొలంలో విద్యుత్ స్తంభం ప్రమాదకరంగా వంగి ఉండటం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. పొలంలో ఉన్న ఈ విద్యుత్ స్తంభం ఎప్పుడైనా కూలిపోయే పరిస్థితిలో ఉండటంతో రైతులు, గ్రామస్థులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పంట పొలాల మధ్యలో ఉన్న ఈ స్తంభం ఒకవైపు తీవ్రంగా వంగి ఉండటంతో విద్యుత్ తీగలపై కూడా ఒత్తిడి పెరిగినట్లు కనిపిస్తోంది. గాలి, వర్షాలు లేదా ఇతర ప్రకృతి వైపరీత్యాల సమయంలో స్తంభం కూలిపోయే ప్రమాదం ఉందని స్థానికులు చెబుతున్నారు. స్తంభం కూలితే విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడమే కాకుండా, పొలాల్లో పనిచేసే రైతులకు, పశువులకు ప్రాణహాని సంభవించే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ప్రమాదకర స్థితిలో ఉన్న ఈ స్తంభాన్ని పరిశీలించి, మరమ్మతులు చేయడం లేదా కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రమాదం జరగకముందే అధికారులు అప్రమత్తమై తక్షణ చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story