కుక్ చేసిన చిన్న పొరపాటు.. 21 మంది ప్రాణాలు తీసింది

by Malleboina Mahesh |

ఢిల్లీ హోటల్ అగ్నిప్రమాదంలో కుక్, యజమాని అరెస్ట్. కరెంట్ ఆఫ్ చేయడంతో డోర్లు లాక్ అయి 21 మంది ఊపిరాడక చనిపోగా, ఫైర్ సేఫ్టీ లేదని నిర్ధారణ.

కుక్ చేసిన చిన్న పొరపాటు.. 21 మంది ప్రాణాలు తీసింది
X

దిశ, వెబ్ డెస్క్: దేశ రాజధాని అయిన ఢిల్లీలోని మాల్వియా నగర్ ప్రాంతంలోని ‘లెమన్ గ్రీన్ రెస్టారెంట్’ (‘Lemon Green Restaurant’) బేస్‌మెంట్‌లో ఒక్కసారిగా భారీగా మంటలు చెలరేగడంతో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోగా పదుల సంఖ్యలో గాయపడ్డారు. కాగా ఈ ఘోర ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేశారు. ఈ భారీ అగ్ని ప్రమాదానికి హోటల్ లో పనిచేసే వంట మనిషి చెసిన చిన్న పొరపాటు కారణంగా అధికారులు గుర్తించారు. ఈ మేరకు పోలీసులు హోటల్ కుక్ కేశవ్ నేగిని అరెస్ట్ చేశారు. వంటగదిలో ఎలక్ట్రిక్ స్టవ్ ఆన్ చేయగానే అది పేలిపోయిందని, దీంతో భయపడిన కుక్ హోటల్ మెయిన్ పవర్‌ను ఆఫ్ చేసి తన ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగెత్తాడు. అయితే, అతను విద్యుత్ సరఫరాను నిలిపివేయడంతో హోటల్‌లోని ఎలక్ట్రానిక్ తలుపులన్నీ లాక్ అయిపోయి, చాలామంది లోపలే చిక్కుకుపోయారు.

చివరకు బాత్‌రూమ్ తలుపులు రాకపోవడంతో ఒక విదేశీ జంట కూడా ఊపిరాడక మరణించినట్లు అధికారులు గుర్తించారు. ఇదిలా ఉంటే హోటల్ యాజమాన్యం అనేక చోట్ల భద్రతా నిబంధనలను ఉల్లంఘించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. కిటికీలు, గ్లాస్ ప్యానల్స్ అన్నీ పూర్తిగా మూసి వేయడం వల్ల దట్టమైన పొగ హోటల్ అంతా అలముకుని, బాధితులు ఊపిరాడక ప్రాణాలు కోల్పోయినట్లు గుర్తించారు. బేస్‌మెంట్ ప్రవేశమార్గానికి తాళం వేసి ఉండటం వల్ల రెస్క్యూ సిబ్బంది లోపలికి వెళ్లడానికి 10 నిమిషాల సమయం పట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించి ఇప్పటికే హోటల్ యజమాని లవ్‌కేష్ బజాజ్‌ను పోలీసులు అరెస్ట్ చేయగా, భవనానికి ఫైర్ సేఫ్టీ సర్టిఫికెట్ లేదనే నిజాన్ని ఆయన విచారణలో అంగీకరించారు.

Next Story