ఘోర రోడ్డు ప్రమాదం: ట్రక్కును వ్యాన్ ఢీకొని ఏడుగురు మృతి

by Malleboina Mahesh |

ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రోడ్డుపై ఘోర ప్రమాదం. పికప్ వాహనం, ట్రక్కును ఢీకొనడంతో ఏడుగురు దుర్మరణం, 10 మందికి పైగా గాయాలు.

ఘోర రోడ్డు ప్రమాదం: ట్రక్కును వ్యాన్ ఢీకొని ఏడుగురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: ప్రయాణికులతో వెళ్తున్న ఓ పికప్ వాహనానికి ఘోర ప్రమాదం (Fatal accident) జరిగి ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ షాకింగ్ సంఘటన పంజాబ్ రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో శనివారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పికప్ వాహనం,ట్రక్కు పరస్పరం బలంగా ఢీకొన్నాయి. ఈ భీకర ప్రమాదంలో ఏడుగురు అక్కడికక్కడే మరణించగా, మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు స్థానిక పోలీసులు ధృవీకరించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిరోజ్‌పూర్-ఫాజిల్కా రోడ్డులోని ‘జంగావాలా మోర్’ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో సదరు పికప్ వాహనంలో సుమారు 25 మంది ప్రయాణికులు ఉన్నారు.

వీరంతా జలాలాబాద్ నుండి అమృత్‌సర్‌లోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రమైన 'బియాస్' (Beas) కు వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాద తీవ్రతకు పికప్ వాహనం పూర్తిగా దెబ్బతింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, స్థానికుల సహాయంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

Next Story