భలే ఛాన్స్ దక్కించుకున్న సమంత.. కానీ 'మా ఇంటి బంగారం'కు అదొక్కటే టెన్షన్

by Pulgam srinivas |

‘మా ఇంటి బంగారం’ చిత్రానికి ‘లెనిన్’ మూవీ వల్ల కాస్త కష్టాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నట్లు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

భలే ఛాన్స్ దక్కించుకున్న సమంత.. కానీ మా ఇంటి బంగారంకు అదొక్కటే టెన్షన్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మా ఇంటి బంగారం’. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ ఇతర చిత్రాలతో పోటీని దృష్టిలో పెట్టుకుని విడుదలను వాయిదా వేస్తూ వచ్చింది. చివరికి ఈ చిత్రాన్ని జూన్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను కూడా వేగవంతం చేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పరిశీలిస్తే జూన్ 19న ‘మా ఇంటి బంగారం’తో పాటు ‘దీవానా’ సినిమా కూడా విడుదల కానుంది.

అయితే అది పూర్తి స్థాయి ప్రేమకథా చిత్రం కావడంతో సమంత సినిమాపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, ‘మా ఇంటి బంగారం’ చిత్రానికి మంచి టాక్ వస్తే బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి వారంలో ఈ సినిమాకు పెద్దగా పోటీ లేకపోయినా రెండో వారంలో మాత్రం పరిస్థితులు కాస్త కఠినంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

దీనికి ప్రధాన కారణం అక్కినేని అఖిల్ హీరోగా తెరకెక్కిన ‘లెనిన్’ సినిమా జూన్ 26న విడుదలకు సిద్ధమవుతుండటమే. భారీ అంచనాల మధ్య వస్తున్న ఈ సినిమాకు ఎక్కువ థియేటర్లు దక్కే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఒకవేళ ‘లెనిన్’ చిత్రానికి పాజిటివ్ టాక్ వస్తే ‘మా ఇంటి బంగారం’ సినిమా థియేటర్ల సంఖ్య తగ్గడంతో పాటు కలెక్షన్లపై కూడా ప్రభావం పడే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి. దీంతో సమంత ఈ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటుందనేది ప్రస్తుతం ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చగా మారింది.

Next Story