- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ క్షమాపణ చెప్పాల్సిందే.. రాహుల్ గాంధీ డిమాండ్
విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని స్వయంగా బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

దిశ, వెబ్ డెస్క్ : దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతున్న నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో బాధితులైన లక్షలాది మంది విద్యార్థులకు, అభ్యర్థులకు మద్దతుగా ప్రతిపక్షాలు కూడా తమ గళం విప్పాయి. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని, కుప్పకూలుతున్న విద్యావ్యవస్థను నిరసిస్తూ ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నివాసం వద్ద విపక్షాలు చేపట్టిన నిరసన కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అలాగే సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌లతో పాటు పలువురు ఎంపీలు సహా కీలక నేతలను పోలీసులు అక్రమంగా అదుపులోకి తీసుకోవడం దేశవ్యాప్తంగా పెను రాజకీయ దుమారం రేపింది. ఈ నాటకీయ పరిణామాల మధ్య స్వయంగా కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియా గాంధీ ప్రత్యక్షంగా రంగంలోకి దిగి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి పోలీసులతో మాట్లాడి అరెస్టయిన నాయకులందరినీ విడిపించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
మోడీ క్షమాపణ చెప్పాలి
పోలీస్ స్టేషన్ నుంచి విడుదలైన అనంతరం రాహుల్ గాంధీ ఒక వీడియా సందేశాన్ని విడుదల చేస్తూ.. కేంద్ర ప్రభుత్వంపై, ప్రధాని మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. విద్యార్థులు పడుతున్న వేదనపై, దేశంలో విద్యావ్యవస్థ ఎందుకు కుప్పకూలుతోందో, పదేపదే పరీక్షా పత్రాలు ఎందుకు లీక్ అవుతున్నాయో అనే అంశంపై దేశవ్యాప్తంగా బహిరంగ చర్చ జరగాలనే ఉద్దేశంతోనే తాము ప్రధాని నివాసం వద్ద ధర్నాకు దిగామని ఆయన స్పష్టం చేశారు. తమ భవిష్యత్తు కోసం, హక్కుల కోసం రోడ్డెక్కి శాంతియుతంగా ఆందోళన తెలుపుతున్న విద్యార్థులపై పోలీసులు విచక్షణా రహితంగా భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య అని మండిపడ్డారు. విద్యార్థులపై జరిగిన ఈ పోలీసు దాడికి బాధ్యత వహిస్తూ ప్రధాని స్వయంగా దేశంలోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
విద్యార్థులు డిమాండ్స్ అంగీకరించాలి
అంతేకాకుండా రాబోయే పార్లమెంట్ సమావేశాల్లో ఈ పేపర్ లీకేజీ వ్యవహారంపై, విద్యావ్యవస్థలోని లోపాలపై సుదీర్ఘంగా, పారదర్శకంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. విద్యార్థులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లన్నింటినీ కేంద్ర ప్రభుత్వం భేషరతుగా అంగీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు, బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునే వరకు తమ పోరాటం ఆగేది లేదని, విపక్షాలన్నీ విద్యార్థుల వెంటే ఉంటాయని ఆయన ఆ వీడియో ద్వారా స్పష్టం చేసారు.






