నాకు 41 ఏళ్లు.. మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ

by Ramesh Naini |   (  Updated:2026-06-06 05:22:44  IST  )

ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగు చూసింది. తన వయసు 41 ఏళ్లు వచ్చినా కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం లేదని, మీరే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కోరుతూ ఓ మహిళ నేరుగా పోలీసులను ఆశ్రయించింది.

నాకు 41 ఏళ్లు.. మా ఇంట్లో పెళ్లి చేయడం లేదు.. పోలీసులను ఆశ్రయించిన మహిళ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగుచూసింది. తన వయసు 41 ఏళ్లు వచ్చినా కుటుంబ సభ్యులు పెళ్లి చేయడం లేదని, మీరే ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని కోరుతూ ఓ మహిళ నేరుగా పోలీసులను ఆశ్రయించింది. తన సోదరుడు, వదిన ఉద్దేశపూర్వకంగానే తన పెళ్లిని అడ్డుకుంటున్నారని ఆమె ఆరోపించడంతో ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

ఫిర్యాదులో బాధితురాలి ఆరోపణలు..

ప్రయాగ్‌రాజ్ జిల్లా సరాయ్ ఇనాయత్ పరిధిలోని మనాపూర్ గ్రామానికి చెందిన మాధురి పటేల్ అనే మహిళ పోలీసులకు ఈ మేరకు ఫిర్యాదు చేసింది. తన ఫిర్యాదులో కుటుంబ సభ్యులపై ఆమె పలు సంచలన ఆరోపణలు చేసింది. తనకు పెళ్లి చేసుకోవాలని ఉన్నా, పెళ్లి ఖర్చులు భరించడం ఇష్టం లేక తన అన్నయ్య, వదిన వచ్చిన సంబంధాలన్నింటినీ పదేపదే తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది. తన సోదరుడు కుటుంబ ఆస్తిని, భూమిని తన పేరు మీదకు మార్చుకున్నాడని, కానీ తన పెళ్లి బాధ్యతను మాత్రం గాలికొదిలేశాడని వాపోయింది.

20 ఏళ్లుగా ఒంటరి పోరాటం..

గత 20 ఏళ్లుగా తాను కుటుంబానికి దూరంగా, ఎలాంటి ఆర్థిక మద్దతు లేకుండా ఒంటరిగా ఉంటున్నానని తెలిపింది. చిన్నపిల్లలకు ట్యూషన్లు చెబుతూ, బ్యూటీ పార్లర్లలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నానని స్పష్టం చేసింది. తాను ఎక్కడ పనిచేసినా కుటుంబ సభ్యులు అక్కడికి వచ్చి, ఉపాధి లేకుండా చేస్తున్నారని ఆరోపించింది. ఏప్రిల్ 27, 2026న తాను మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, కుటుంబ సభ్యులు తన గదిలోకి చొరబడి భౌతికంగా దాడి చేశారని ఫిర్యాదులో పేర్కొంది. చుట్టుపక్కల వారు సైతం ‘ఇంకా పెళ్లెందుకు కాలేదు?’ అని ప్రశ్నిస్తుండటంతో మానసిక క్షోభకు గురవుతున్నట్లు తెలిపింది. ‘నాకు రక్షణ కల్పించండి.. నేనొక గౌరవప్రదమైన జీవితం గడిపేలా మంచి వ్యక్తిని చూసి మీరే వివాహం జరిపించండి’ అని మాధురి పోలీసులను కోరింది.

ఆస్తి వివాదమే కారణమన్న కుటుంబం

అయితే, మాధురి చేస్తున్న ఆరోపణలను ఆమె తల్లిదండ్రులు, సోదరుడు, వదిన, సోదరి పూర్తిగా ఖండించారు. గతంలో మాధురి పెళ్లి కంటే చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చిందని, తమ మద్దతుతోనే ‘డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్’ (D.El.Ed) పూర్తి చేసిందని ఆమె తల్లి వివరించింది. కొందరు బంధువులు రెచ్చగొట్టడం వల్లే ఆమె తండ్రి ఆస్తిలో వాటా అడుగుతోందని, ఈ ఆరోపణల వెనుక ఉన్న అసలు కారణం ఆస్తి వివాదమేనని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు.

పోలీసుల దర్యాప్తు - నెట్టింట చర్చ

ఈ వ్యవహారంపై స్పందించిన పోలీసులు.. ఇరువర్గాలను స్టేషన్‌కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ ఘటనపై ఇంకా ఎటువంటి ఎఫ్ఐఆర్ (FIR) నమోదు కాలేదని, వాస్తవాలను నిర్ధారించేందుకు విచారణ కొనసాగుతోందని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్ల మధ్య తీవ్ర స్థాయి చర్చకు దారితీసింది. వ్యక్తిగత స్వేచ్ఛ, కుటుంబ బాధ్యతలకు సంబంధించిన ఈ వ్యవహారంలో కొందరు సదరు మహిళ పట్ల సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. మరికొందరు మాత్రం కుటుంబ సమస్యల్లో పోలీసుల జోక్యం ఎంతవరకు సబబు అని ప్రశ్నిస్తూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Next Story