మేము గొర్రెలం కాదు.. ప్రశ్నించడం మా హక్కు.. నాగబాబుకు ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్

by Ramesh Naini |

జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ఓ ట్వీట్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

మేము గొర్రెలం కాదు.. ప్రశ్నించడం మా హక్కు.. నాగబాబుకు ప్రకాశ్‌ రాజ్‌ స్ట్రాంగ్ కౌంటర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జనసేన నేత, ఎమ్మెల్సీ నాగబాబు చేసిన ఓ ట్వీట్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘నాయకుడిని ఎలాంటి ప్రశ్నలు అడగకుండా అనుసరించండి’ అన్న నాగబాబు వ్యాఖ్యలకు ‘మేము బానిస బతుకు బతకడానికి గొర్రెలం కాదు’అంటూ ప్రకాశ్‌ రాజ్‌ గట్టి కౌంటర్ ఇచ్చారు. దీంతో సోషల్ మీడియాలో జనసేన వర్సెస్ ప్రకాశ్‌ రాజ్‌ అన్నట్లుగా పొలిటికల్ హీట్ పెరిగింది.

వివాదం ఎలా మొదలైందంటే..?

తెలంగాణలో జనసేన పార్టీ పోటీ చేస్తుందని పవన్ కల్యాణ్ చేసిన ప్రకటనపై ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. పరోక్షంగా పవన్‌ను ఉద్దేశిస్తూ.. ‘సింగిల్‌గా వస్తున్నారా? పొత్తుతో వస్తున్నారా?’ అని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలకు నిర్మాత బండ్ల గణేష్ ఘాటుగా బదులివ్వడంతో ట్విట్టర్ వేదికగా మాటల యుద్ధం మొదలైంది.

నాగబాబు ట్వీట్..

ఈ నేపథ్యంలో జనసేన ప్రధాన కార్యదర్శి నాగబాబు పరోక్షంగా ప్రకాశ్ రాజ్‌ను ప్రస్తావిస్తూ పవన్ కల్యాణ్ ఫోటోతో ఓ పోస్ట్ పెట్టారు. ‘నాయకుడి మాటే అంతిమం. ఏది ఒప్పో, ఏది తప్పో ఆయనకు మాత్రమే తెలుసు. మీ సందేహాలను పక్కన పెట్టండి, నోరు మూయండి, ఏ ప్రశ్నలూ వేయకుండా నాయకుడిని అనుసరించండి’ అని అందులో పేర్కొన్నారు.

ప్రకాశ్‌ రాజ్‌ కౌంటర్..

నాగబాబు చేసిన ‘నోరు మూయండి’ అన్న వ్యాఖ్యలపై ప్రకాశ్ రాజ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘మీ సందేహాలు ఆపేయండి, మీ నాలుకను సైలెంట్ చేయండి.. అంటే అర్ధం ఏంటి? మేము గొర్రెలం కాదు.. బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా.. నేనే నాయకుడిని అనుకున్నవాడైనా, సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత ఉంటుంది. అర్థం అయిందా?’ అని తన పోస్ట్‌లో ఘాటుగా రాసుకొచ్చారు. సోషల్ మీడియా వేదికగా సామాజిక, రాజకీయ అంశాలపై ఎప్పుడూ తన గళాన్ని వినిపించే ప్రకాశ్‌ రాజ్‌ చేసిన ఈ తాజా ట్వీట్లతో రెండు రోజుల నుంచి నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ప్రకాశ్ రాజ్ తాజా కౌంటర్‌కు నాగబాబు ఏ విధంగా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది.

Next Story