Petrol-Diesel:‘బంకుల్లో నిల్’.. బ్లాక్‌లో ‘ఫుల్’!

by Jakkula.Mamatha |   (  Updated:2026-03-21 12:53:08  IST  )

తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది.

Petrol-Diesel:‘బంకుల్లో నిల్’.. బ్లాక్‌లో ‘ఫుల్’!
X

దిశ,తిరుమలగిరి: తిరుమలగిరి మున్సిపాలిటీ కేంద్రంలో గత కొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ కొరత తీవ్ర రూపం దాల్చింది. బంకులకు వెళ్లిన ప్రజలకు “స్టాక్ లేదు” అనే సమాధానం తప్ప మరొకటి లభించడం లేదు. అయితే ఇదే సమయంలో బ్లాక్ మార్కెట్‌లో మాత్రం ఇంధనం లభ్యత పెరిగి, అది కూడా అధిక ధరలకు అమ్ముడవుతున్న పరిస్థితి స్థానికంగా పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ వాతావరణం, ముడి చమురు సరఫరాలో అంతరాయం వంటి కారణాలతో ఇంధన కొరత ఏర్పడినప్పటికీ, స్థానికంగా జరుగుతున్న వ్యవహారాలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బంక్‌లలో అధికారికంగా “నిల్” అని చెప్పబడుతున్న ఇంధనం, బ్లాక్ మార్కెట్‌లో “ఫుల్”గా ఎలా లభ్యమవుతోందని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.

స్థానికుల ఆరోపణల ప్రకారం.. కొంతమంది పెట్రోల్ బంక్ నిర్వాహకులు నేరుగా ఇతర వ్యాపారులకు ఇంధనాన్ని మళ్లించి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు వినికిడి. దీంతో సాధారణ ప్రజలు ఇబ్బందులు పడుతుండగా,అక్రమ వ్యాపారులు లాభాలు గడిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక గృహ వినియోగానికి ఉద్దేశించిన వంట గ్యాస్ సిలిండర్ల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉందని సమాచారం. గృహ అవసరాల కోసం సిలిండర్లు అందుబాటులో లేకపోయినా, హోటళ్లు మరియు వ్యాపార రంగాల్లో మాత్రం విరివిగా వినియోగంలో ఉండటం గమనార్హం. ఇది స్పష్టంగా నిబంధనల ఉల్లంఘనగా భావిస్తున్న ప్రజలు, సంబంధిత అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు.

“సామాన్యులకు ఇంధనం దొరకక, బ్లాక్ మార్కెట్‌దారులు దోపిడీకి పాల్పడటం ఎంతవరకు సమంజసం?” అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. వెంటనే టాస్క్ ఫోర్స్ అధికారులు రంగంలోకి దిగిపట్టి, బంకులపై అకస్మిక దాడులు నిర్వహించి వాస్తవ పరిస్థితులను వెలికి తీయాలని, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ప్రజల నిత్య జీవితానికి అత్యవసరమైన ఇంధన సరఫరా విషయంలో ఇలాంటి అక్రమాలు కొనసాగితే, పరిస్థితి మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు మేల్కొని చర్యలు తీసుకుంటారా? లేక బ్లాక్ మార్కెట్ దందా ఇదేలా కొనసాగుతుందా? అన్న ప్రశ్నలకు సమాధానం కోసం తిరుమలగిరి ప్రజలు ఎదురుచూస్తున్నారు.

Next Story