- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వర్షాకాలంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: మహదేవ్‌పూర్ ఎస్సై
వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మండల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్వీయ రక్షణతో పాటు కుటుంబ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మహదేవ్‌పూర్ ఎస్సై సాంబమూర్తి సూచించారు.

దిశ, మహదేవ్‌పూర్: వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో మండల ప్రజలందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, స్వీయ రక్షణతో పాటు కుటుంబ భద్రతపై అప్రమత్తంగా ఉండాలని మహదేవ్‌పూర్ ఎస్సై సాంబమూర్తి సూచించారు. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రజల అవగాహన కోసం పలు కీలక సూచనలు జారీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాల వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కోరారు. ఇళ్ల పైకప్పులు, గోడలకు లీకేజీలు ఉంటే వెంటనే మరమ్మతులు చేయించుకోవాలని, కరెంట్ వైర్లు లేదా సాకెట్లు తడవకుండా చూసుకోవాలని తెలిపారు. తడిసిన వైర్లను, విద్యుత్ పరికరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ తాకరాదని హెచ్చరించారు.
ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో నిలబడకూడదని సూచించారు. రోడ్లపై నీరు నిలిచిన చోట, ముంపు ప్రాంతాల్లో ప్రయాణాలు చేయవద్దని కోరారు. వాహనదారులు వేగం తగ్గించి, చాలా జాగ్రత్తగా నడపాలని స్పష్టం చేశారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున కాచి చల్లార్చిన లేదా స్వచ్ఛమైన నీటిని మాత్రమే తాగాలన్నారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని, డ్రైనేజీ, కాలువలను శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల నివారణ సాధ్యమవుతుందని చెప్పారు. చిన్నపిల్లలను చెరువులు, వాగులు, నిండిన బావుల దగ్గరకు వెళ్లనివ్వద్దని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
ప్రజలు ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో చిక్కుకుంటే తక్షణ సహాయం కోసం క్రింది నంబర్లను సంప్రదించాలని, ఈ నంబర్లను ఫోన్లలో సేవ్ చేసుకోవాలని కోరారు:
పోలీస్: 100
ఫైర్ స్టేషన్: 101
అంబులెన్స్: 108
మహదేవ్‌పూర్ ఎస్ఐ హెల్ప్‌లైన్: 8712658116
"మీ భద్రత - మా బాధ్యత" అనే సంకల్పంతో పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, ప్రజలంతా సహకరించి సురక్షిత తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఎస్ఐ పిలుపునిచ్చారు.






