- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్రీన్ టీలో గండి చీమలు.. నిలదీస్తే హోటల్ యాజమాన్యం నిర్లక్ష్యపు సమాధానం!
జడ్చర్ల పట్టణంలోని కల్వకుర్తి–జడ్చర్ల 167వ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ చాయ్ క్లబ్‌లో కస్టమర్లకు షాకింగ్ ఘటన ఎదురైంది.

దిశ, జడ్చర్ల: జడ్చర్ల పట్టణంలోని కల్వకుర్తి–జడ్చర్ల 167వ జాతీయ రహదారి పక్కన ఉన్న ఓ చాయ్ క్లబ్‌లో కస్టమర్లకు షాకింగ్ ఘటన ఎదురైంది. టీ తాగేందుకు వచ్చిన వారికి అందించిన గ్రీన్ టీలో గండి చీమలు కనిపించడం కలకలం రేపింది. హోటల్ నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరి కస్టమర్ల ఆగ్రహానికి కారణమైంది. మిడ్జిల్ మండల కేంద్రానికి చెందిన రమేష్ తన ముగ్గురు మిత్రులతో కలిసి టీ తాగేందుకు చాయ్ క్లబ్‌కు వెళ్లాడు. మూడు సాధారణ టీలు, ఒక గ్రీన్ టీ ఆర్డర్ చేశారు. సబ్జా గింజలతో గ్రీన్ టీ తీసుకొచ్చిన సిబ్బంది, కప్పును అందించగా తాగేందుకు ప్రయత్నించిన వ్యక్తికి అందులో గండి చీమలు తేలుతూ కనిపించాయి.
వెంటనే కప్పును పక్కన పెట్టి నిర్వాహకులను ప్రశ్నించగా, "అవును.. పడవచ్చు" అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడం మరింత ఆగ్రహానికి గురిచేసింది. హోటల్‌లో పరిశుభ్రత ప్రమాణాలు పాటించకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని కస్టమర్లు ఆరోపించారు. బయటకు కనిపించే పరిస్థితి ఇలా ఉంటే, వంటగది, ఆహార పదార్థాల నిల్వ గదుల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కన ఉన్న హోటళ్లలో ప్రతి రోజూ వందలాది మంది ప్రయాణికులు, స్థానికులు టీ, టిఫిన్లు, భోజనం చేస్తుంటారు.
ఇలాంటి చోట్ల నాణ్యత, పరిశుభ్రత విషయంలో రాజీ పడితే ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని పలువురు పేర్కొన్నారు. జడ్చర్ల పట్టణంలోని హోటళ్లు, టీ స్టాళ్లు, రెస్టారెంట్లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కేవలం పేరుకే జరుగుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆహార నాణ్యత, పరిశుభ్రత, గడువు ముగిసిన పదార్థాల వినియోగం పై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘిస్తున్న హోటళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై సంబంధిత అధికారులు స్పందించి, చాయ్ క్లబ్‌లో పరిశుభ్రత ప్రమాణాలు, ఆహార నాణ్యతపై విచారణ జరిపి, నిర్లక్ష్యానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.






