9 మంది జాలర్లు సేఫ్.. ఒడిశా తీరంలో చిక్కుకున్న మరో బోటు: సహాయక చర్యలు ముమ్మరం

by Ramesh Naini |

ఇంజిన్ మొరాయించడంతో విశాఖకు చెందిన మరో ఫిషింగ్ బోటు ఒడిశాలోని పూరీ సముద్ర జలాల్లో చిక్కుకుపోయింది.

9 మంది జాలర్లు సేఫ్.. ఒడిశా తీరంలో చిక్కుకున్న మరో బోటు: సహాయక చర్యలు ముమ్మరం
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇంజిన్ మొరాయించడంతో విశాఖకు చెందిన మరో ఫిషింగ్ బోటు ఒడిశాలోని పూరీ సముద్ర జలాల్లో చిక్కుకుపోయింది. జూన్ 22న విశాఖ ఫిషింగ్ హార్బర్ నుంచి వేటకు వెళ్లిన ఈ బోటు, గత నాలుగు రోజులుగా రాకాసి కెరటాల మధ్య కొట్టుమిట్టాడుతోంది. అయితే, అందులోని మత్స్యకారులంతా ప్రాణాలతో సురక్షితంగా ఉన్నామని, తమను కాపాడాలని కోరుతూ వీడియో సందేశం ద్వారా కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అందులో మొత్తం తొమ్మిది జాలర్లు ఉన్నట్లు తెలుస్తోంది.

బాధితులంతా విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చింతపల్లి వాసులుగా గుర్తించారు. ఈ విషయం తెలుసుకున్న విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తక్షణమే విశాఖ కలెక్టర్‌తో మాట్లాడి పరిస్థితి తీవ్రతను వివరించారు. స్పందించిన కలెక్టర్.. కోస్ట్‌గార్డ్ బృందాల సాయంతో మత్స్యకారులను రక్షించేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. మరోవైపు, మత్స్యకారుల కుటుంబ సభ్యులతో ఫోన్‌లో మాట్లాడిన ఎంపీ అప్పలనాయుడు.. ప్రభుత్వం అండగా ఉంటుందని వారికి భరోసా కల్పించారు. కాగా, విశాఖ హార్బర్ నుంచి సముద్రంలోకి వెళ్లిన మరో బోటులో ఏడుగురు మత్సకారులు గల్లంతైన విషయం తెలిసిందే. ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ లభ్యం అయ్యింది. మిగితా వారి కోసం గాలింపు చర్యలు సాగుతున్నాయి.

Next Story