రాష్ట్రంలో నకిలీ సోయా విత్తనాల కలకలం.. లబోదిబోమంటున్న ఆ జిల్లా రైతులు

by Kema Shiva Kumar |

వానాకాలం పంటసాగు వేళ రాష్ట్రంలో నకిలీ సోయా విత్తనాలు కలకలం రేపుతున్నాయి.

రాష్ట్రంలో నకిలీ సోయా విత్తనాల కలకలం.. లబోదిబోమంటున్న ఆ జిల్లా రైతులు
X

దిశ, వెబ్‌డెస్క్: వానాకాలం సీజన్‌లో పంటసాగు పనుల్లో నిమగ్నం కావాల్సిన అన్నదాతలు నకిలీ విత్తనాలతో తలలు పట్టుకుంటున్నారు. దుకాణదారులు చెప్పిన మాట నమ్మి కొనుగోలు చేసిన విత్తనాలు భూమిలో వేసినా మొలకెత్తకపోవడంతో ఆవేదనతో ఆదిలాబాద్ జిల్లా రైతులు లబోదిబోమంటున్నారు. సోనం సీడ్స్ (Sonam Seeds) కంపెనీకి చెందిన విత్తనాల వల్ల తాము తీవ్రంగా నష్టపోయామని ఆరోపిస్తున్నారు. బాధిత రైతుల కథనం మేరకు ఈ సీజన్ సాగు కోసం రైతులు మార్కెట్లో లభించే సోనం సీడ్స్ కంపెనీ వారి తేజస్విని రకం (Tejaswini Type) విత్తనాలను కొనుగోలు చేశారు. ఒక్కో బస్తాకు ఏకంగా రూ.3,900 చొప్పున భారీ ధర చెల్లించి తెచ్చుకున్నారు. ఎంతో ఆశతో పొలాల్లో విత్తనాలు అలికినప్పటికీ.. కనీసం 5 నుంచి 10 శాతం కూడా మొలకెత్తలేదు.

అధికారులు పట్టించుకోవడం లేదు..

అయితే, సోయా విత్తనాలను అప్పు చేసి మరీ పెద్ద మొత్తంలో పొలాల్లో అలికినా మొలవకపోవడంతో తాము మోసపోయి గోస పడుతున్నామని ఆదిలాబాద్ జిల్లాలోని పలువురు సోయా రైతుల కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ సందర్భంగా ఓ రైతు మాట్లాడుతూ.. తాను సోయా విత్తనాలు బస్తా రూ.3,900 కొనుగోలు చేశానని అన్నారు. 6 ఎకరాల్లో విత్తనాలను అలికానని ఇప్పటి వరకు మొలకలు రాలేదని అన్నారు. ఈ ‘నకిలీ’ విత్తనాల వ్యవహారాన్ని తాము వ్యవసాయ అధికారులతో పాటు సదరు కంపెనీకి ఫిర్యాదు చేశామని తెలిపారు. కంపెనీ వారు తమకు ప్రత్యామ్నాయంగా మరోసారి విత్తనాలు ఇస్తామని చెబుతున్నారని.. అయినా తాము తీసుకోబోమని అన్నారు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా వర్షాలు విపరీతంగా కురుస్తున్నాయని, విత్తనాలు అలికే పరిస్థితి లేదన్నారు. ఈ మోసంపై వ్యవసాయ శాఖ అధికారులు విచారణ చేపట్టి బాధిత రైతులకు నష్ట పరిహారం చెల్లించేలా సదరు సీడ్ కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Next Story