తారక్–నెల్సన్ ప్రాజెక్ట్‌కు బ్రేక్.. నాగ వంశీ మాటల్లో అంతరార్థం అదేనా?

by Pulgam srinivas |

తారక్–నెల్సన్ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలు ఉన్న, అది పట్టాలెక్కేందుకు చాలా సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తారక్–నెల్సన్ ప్రాజెక్ట్‌కు బ్రేక్.. నాగ వంశీ మాటల్లో అంతరార్థం అదేనా?
X

దిశ, వెబ్ డెస్క్: స్టార్ నిర్మాత సూర్యదేవర నాగ వంశీ తాజాగా నిర్మించిన 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఆయన వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటూ సినిమా విశేషాలతో పాటు పలు ఆసక్తికర విషయాలను పంచుకుంటున్నారు. ఈ క్రమంలో, చాలా కాలంగా నాగ వంశీ నిర్మాణంలో, జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని గతంలో నాగ వంశీ కూడా ధృవీకరించినప్పటికీ, ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

తాజా ఇంటర్వ్యూలో ఆయనను "నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో చేయబోతున్న సినిమా ఏమైంది?" అని ప్రశ్నించగా, నాగ వంశీ స్పందిస్తూ... ప్రస్తుతం నెల్సన్ ఇతర ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారని, అయినప్పటికీ తనకు అత్యంత ఇష్టమైన దర్శకుల్లో ఆయన ఒకరని చెప్పారు. అంతేకాకుండా, ఇప్పటికే తమ మధ్య సినిమా కోసం ఒప్పందం కూడా కుదిరిందని వెల్లడించారు. ఆ తర్వాత "ఆ సినిమాలో హీరోగా ఎవరు నటిస్తారు?" అని అడగగా, దాదాపుగా జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఉండే అవకాశాలున్నాయని తెలిపారు.

మొదటి నుంచే నెల్సన్‌కు తారక్‌తో సినిమా చేయాలనే ఆసక్తి ఉందని చెప్పారు. అయితే ప్రస్తుతం ఇద్దరూ తమ తమ కమిట్‌మెంట్‌లతో బిజీగా ఉన్నారని, అవి పూర్తయిన తర్వాతే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశం ఉందని వెల్లడించారు. ప్రస్తుతం నెల్సన్ దిలీప్ కుమార్ 'జైలర్ 2' చిత్రంతో బిజీగా ఉండగా, జూనియర్ ఎన్టీఆర్ 'డ్రాగన్' పూర్తి చేసిన అనంతరం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్–నెల్సన్ కాంబినేషన్‌లో సినిమా ఇప్పట్లో ప్రారంభమయ్యే అవకాశాలు తక్కువగానే ఉన్నాయని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Next Story