- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇందిరానగర్‌లో నూతన కమ్యూనిటీ హాల్, జిమ్ నిర్మాణానికి ఆర్థిక సాయం
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నాంపల్లి నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.

దిశ, కార్వాన్: సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో కేంద్రమంత్రి జి. కిషన్ రెడ్డి విస్తృతంగా పర్యటించారు. ఈ మేరకు ఆదివారం అయోధ్య నగర్,సీతారాం బాగ్, ఆసిఫ్ నగర్ లోని పలు బస్తీలను సందర్శించిన ఆయన, వివిధ పార్కులలో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్స్‌ను ప్రారంభించారు. అలాగే న్యూ ఇందిరానగర్‌లో బద్ది పోచమ్మ, బంగారు మైసమ్మ కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించిన కేంద్రమంత్రి, అక్కడి నల్ల పోచమ్మ ఆలయ ప్రాంగణంలో నూతన వ్యాయామశాల (జిమ్), నూతన కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సహకారాన్ని అందిస్తానని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఇందిరానగర్ లో ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచన మేరకు ఈ ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ మానవ వనరులుగా తోడ్పడాలని పిలుపునిచ్చారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ జీహెచ్ఎంసీ పరిధిలో ట్రీ ప్లాంటేషన్, వర్షపు నీటి కాలువలు, పైప్‌లైన్లలో పూడికతీత పనులు ఎక్కడా జరగడం లేదని మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు చెరువులుగా మారి ప్రజలు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
వర్షపు నీరు మూసీ నది ద్వారా...
గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం హైదరాబాద్‌ను లండన్, సింగపూర్ చేస్తామని గొప్పలు చెప్పడమే తప్ప.. గత మూడేళ్లుగా క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు చేయలేదని విమర్శించారు. ఈ ఏడాది జూన్ నెలలో దేశంలో, ముఖ్యంగా హైదరాబాద్‌లో సాధారణం కంటే 40 నుండి 50 శాతం తక్కువ వర్షపాతం నమోదైందని కిషన్ రెడ్డి గుర్తుచేశారు. హైదరాబాద్ కాంక్రీట్ జంగిల్‌గా మారి వేడి విపరీతంగా పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షపు నీరు మూసీ నది ద్వారా వృథాగా సముద్రంలో కలవకుండా భూమిలోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి ఇంట్లో, ప్రతి పార్కులో వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ (ఇంగుడు గుంతలు) ఏర్పాటు చేసి పర్యావరణాన్ని కాపాడుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నేషనల్ ఎస్సీ సెల్ మాజీ సభ్యులు కె.రాములు,మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, అల పురుషోత్తం, మాజీ కార్పొరేటర్ శశికళ, నవోదయ సేవా సంఘం అధ్యక్షుడు రామకృష్ణ, సుధాకర్, నరేష్, సాయి, గణేష్, అరుణ్, రజినీ, రాణి, జీ హెచ్ ఎం సి డిప్యూటీ కమీషనర్ దశరథ్, వాటర్ వర్క్స్ జీఎం శ్రీను నాయక్, కులుసుంపుర ఏసిపి తిరుపతి, మంగల్ హాట్ ఇన్స్పెక్టర్ రాఘవేందర్, బిజెపి నాయకులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.






