కోదాడలో ఒక్కసారిగా భారీ పేలుడు.. భయంతో పరుగులు తీసిన జనం!

by Jakkula.Mamatha |

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ పక్కన గల్లీలో ఆదివారం ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.

కోదాడలో ఒక్కసారిగా భారీ పేలుడు.. భయంతో పరుగులు తీసిన జనం!
X

దిశ, కోదాడ: సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని రంగా థియేటర్ పక్కన గల్లీలో ఆదివారం ఒక్కసారిగా భారీ పేలుడు శబ్దం వినిపించడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. భారీ శబ్దానికి పరిసర ప్రాంతమంతా ఒక్కసారిగా దద్దరిల్లగా, అక్కడ ఉన్న ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు భయంతో పరుగులు తీశారు. కొద్ది క్షణాల పాటు ఏం జరిగిందో అర్థం కాక స్థానికులు ఆందోళనకు గురయ్యారు. స్థానికుల సమాచారం ప్రకారం.. గల్లీలో ఉన్న గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్‌లో సాంకేతిక లోపం ఏర్పడటంతోనే ఈ భారీ శబ్దం వినిపించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే పేలుడు జరిగిన ఖచ్చితమైన కారణాలపై ఇంకా అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. ఘటన తీవ్రతకు సమీపంలోని జ్యూస్ సెంటర్ షాపు మొత్తం ఒక్కసారిగా కంపించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో నమోదయ్యాయి.

భారీ శబ్దంతో షాపులో ఉన్న వస్తువులు కదలడం, అక్కడున్న వారు ఒక్కసారిగా ఉలిక్కిపడడం వీడియోల్లో స్పష్టంగా కనిపిస్తోంది. అంతేకాకుండా పేలుడు ప్రభావంతో రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలపై ఏర్పాటు చేసిన కాంక్రీట్ స్లాబ్‌లు సైతం ధ్వంసమైనట్లు స్థానికులు తెలిపారు. దీంతో పేలుడు తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థమవుతోందని వారు పేర్కొంటున్నారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం, ఎవరికీ గాయాలు కాకపోవడం ఊరట కలిగించే అంశంగా మారింది. అయితే ఆ సమయంలో ఆ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో ప్రజలు సంచరిస్తుండటంతో తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు, వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటనకు గల అసలు కారణాలపై సంబంధిత అధికారులు సమగ్ర దర్యాప్తు చేపట్టి, సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా, అనే అంశాలను నిర్ధారించాల్సి ఉంది. ప్రజల భద్రత దృష్ట్యా గ్యాస్ ఫిల్లింగ్ కేంద్రాల్లో భద్రతా ప్రమాణాలను కచ్చితంగా అమలు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Next Story